
తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డిగ్రీ పూర్తచేసిన ఉద్యోగులు, నిరుద్యోగులు ఓటు వేయనున్నారు. దీంతో.. ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన విషయం తీవ్ర చర్చకు దారితీస్తోంది. నిజానికి తెలంగాణ ఉద్యమం సాగిన ప్రధాన అంశాల్లో ఉద్యోగాల కల్పన ఒకటి. ‘నీళ్లు, నిధులు నియామకాలు’ అనే మూడు లక్ష్యాలను సాధించుకునే దిశగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది. చివరకు విజయం సాధించింది కూడా. అయితే.. రాష్ట్రం ఏర్పడిన ఆరు సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారనే విషయమై ఈ ఎన్నికల వేళ వాదోపవాదాలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి.
Also Read: వార్తల్లో ఏపీ మంత్రులు.. టార్గెట్ అయ్యారా?!
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఓ జాబితా రిలీజ్ చేశారు. రాష్ట్రం ఇప్పటి వరకూ లక్షా ముఫ్పై వేల ఉద్యోగాలకుపైగా భర్తీ చేశామని ప్రకటించారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై బహిరంగలేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేళ్లలో 1,32,899 ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేసినట్టు ప్రకటించారు. ఆ పోస్టుల వివరాలను కూడా తన లేఖలో ఉంచారు కేటీఆర్. విపక్షాలు అసత్యాలు చెబుతున్నాయని, యువత ఈ విషయాన్ని గుర్తించాలని అన్నారు. వారికి స్పష్టత ఇచ్చేందుకే ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు చెప్పారు మంత్రి.
పైన చెప్పిన లెక్క కేవలం ప్రభుత్వ రంగానిది మాత్రమేనని.. ప్రైవేటు రంగంలో మరో 14లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీనిపై విపక్షాలు స్పందించాయి. కేటీఆర్ చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా కేటీఆర్ లెక్కలను తప్పుబట్టారు. ఈ విషయంలో చర్చించేందుకు సిద్ధమని, కేటీఆర్ ఎక్కడికి పిలిస్తే అక్కడి వస్తామని సవాల్ విసిరారు.
Also Read: అడకత్తెరలో పోకచెక్కలా ఏపీ బీజేపీ..!
పట్టభద్రుల ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లే కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో వారిని ఆకర్షించేందుకు అటు అధికార పార్టీ.. ఇటు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే.. తెలంగాణ యువత ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాలేదన్నది నిర్వివాదం. ఈ విషయమై చాలా కాలంగా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే.. ప్రభుత్వం చెబుతున్నట్టు ఎంత మందికి ఉద్యోగాలు కల్పించిందనేది రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరమైతే ఉంది. మరి, ఈ నేతలు చేస్తున్న సవాళ్లు కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమేనా..? చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నిస్తోంది తెలంగాణ యువత.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్