Fake Embassy : శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపయోగాలు అంటారు. అయితే కొంతమంది ఈ సామెతను మరో విధంగా అమలులో పెడుతుంటారు. అలాంటి వారి చేష్టలు చూసిన తర్వాత శతకోటి దరిద్రాలు కాదు శతకోటి మోసాలకు అనంతకోటి ఉపాయాలు అని చదువుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువే కథనంలో ఈ వ్యక్తి చేసిన మోసం మామూలుది కాదు. పైగా దాని పేరుతో అతడు ఎంతగా దండుకున్నాడో తెలిస్తే మీరు ఒకసారిగా షాక్ కు గురవుతారు.
నిత్యానంద తెలుసు కదా.. ఏకంగా కైలాస పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైన కరెన్సీ, సైన్యం, రిజర్వ్ బ్యాంక్, ఇలా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పుకున్నాడు. అంతేకాదు తన దేశంలోకి వస్తే చాలామందికి ముక్తి మార్గం లభిస్తుందని.. శివుడికి ప్రత్యక్ష సేవ చేసుకోవచ్చని డబ్బాలు కొట్టాడు. కానీ అదంతా బూటకమని.. ఆయన మీద ఉన్న కేసులను పక్కదారి పట్టించడానికి చేసిన దిక్కుమాలిన వ్యవహారం అని తర్వాత తేలింది. అంతేకాదు కైలాస అనే పేరుతో దేశం లేదని.. అదంతా నిత్యానంద ఆడిన నాటకం అని గ్లోబల్ మీడియాలో వచ్చిన వార్తల ద్వారా తెలిసింది.. అయితే నిత్యానందను ఆదర్శంగా తీసుకొని ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ ప్రాంతంలో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఏకంగా పేరు లేని దేశాన్ని సృష్టించాడు. అదే కాదు దానికి ఎంబసీ కూడా క్రియేట్ చేశాడు. ఎంబసీ కార్యాలయం ఎదుట ఖరీదైన వాహనాలను పార్క్ చేయించాడు. అక్కడ పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చి సార్ వ్యవహార శైలి మీద ఒక కన్నేసారు. అంతే ఒక్కసారిగా సార్ భాగోతం బయటపడింది.
హర్షవర్ధన్ జైన్ ఉన్నత చదువులు చదివాడు. కాకపోతే వాటిని తన ఉన్నతి కోసం ఉపయోగిస్తే బాగుండేది. పక్కా నేలపూరితమైన మెదడు అతడిది.. అందువల్లే అతని ఆలోచనలు కూడా అలాగే సాగిపోయేవి.. నిత్యానందను ఆదర్శంగా తీసుకొని అతని ఏకంగా వెస్ట్ ఆర్కిటికా అనే దేశాన్ని సృష్టించాడు.. ఆ దేశానికి ఒక ఎంబసీని కూడా క్రియేట్ చేశాడు.. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ ప్రాంతంలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఆ బిల్డింగ్ ఎదుట అత్యంత ఖరీదైన కార్లను పార్క్ చేసేవాడు. వాటికి నెంబర్లను కూడా వివిధ దేశాలవి వాడేవాడు. వివిధ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు, ప్రధాన మంత్రుల ఫోటోలను వాటికి జత చేసేవాడు. వారి పేరుతో స్టాంపులు.. ఇతర ధ్రువీకరణ పత్రాలను సృష్టించాడు. అంతేకాదు స్థానికంగా కూడా ప్రచారం చేసుకున్నాడు. తనకు కొంత డబ్బు ఇస్తే ఆ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికేవాడు. అతని వ్యవహార శైలి చూసిన చాలా మంది నమ్మారు.. అతడికి భారీగా డబ్బు ఇచ్చి.. తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ దృవపత్రాలు ఇచ్చి.. ఫ్లైట్ ఎక్కి మీరు వెస్ట్ ఆర్కిటికా వెళ్లి ఉద్యోగాలు చేసుకోవచ్చని సూచించేవాడు. అతడు చెప్పినట్టుగా వెస్ట్ ఆర్కిటిక్ దేశం లేకపోవడంతో మోసపోయిన నిరుద్యోగులు చివరికి ఇండియాకు వచ్చారు.. ఈ సమాచారం మొత్తాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీసులు కొద్దిరోజులుగా ఈ కార్యాలయం మీద నిఘా పెట్టారు.. అంతేకాదు అతడిని పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అతని వద్ద నుంచి నకిలీ ధృవపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో అతడు ఒక్కడే ఉన్నాడా.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.