
కేవలం బనియన్, అండర్ వేర్ ధరించి రైల్లో తిరిగారు ఓ ఎమ్మెల్యే. ఇది చూసిన బోగీలోని మిగత ప్రయాణికులు అవాక్కయ్యారు. ఆ తర్వాత తేరుకొని, ఇదేంటని ప్రశ్నించడంతో.. వివాదం కూడా తలెత్తింది. ఈ వ్యవహారం అటూ ఇటూ తిరిగి సోషల్ మీడియాకు లీకవడంతో.. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకు ఇలా తిరగాల్సి వచ్చింది? అన్నది చూద్దాం.
ఆయన బీహార్ లోని జేడీయూకు చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్. గురువారం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజస్ రాజధాని ఎక్స్ ప్రెస్ లోని ఏసీ కంపార్ట్ మెంట్లో ప్రయాణించారు. రైలు ఉత్తరప్రదేశ్ లోని దిల్ నగర్ దాటుతున్న సమయంలో ఎమ్మెల్యే లో దుస్తుల్లో వాష్ రూమ్ కు వెళ్లి వచ్చారు. అయితే.. అదే కంపార్ట్ మెంట్లో ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న ప్రహ్లాద్ పాశ్వాన్ అనే వ్యక్తి.. సదరు ఎమ్మెల్యే అవతారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో.. ఇరువురి మధ్య కాసేపు వాదన కూడా జరిగింది. ఈ క్రమంలో అడ్డు చెప్పిన వారిని ఎమ్మెల్యే గోపాల్ మండల్ బెదిరించారని, తుపాకీతో కాల్చేస్తానని కూడా బెదిరించారని పాశ్వాన్ ఆరోపించారు. ఈ విషయమై ఆ బోగీలోని ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వారు ఎమ్మెల్యేలను మరో కోచ్ లోకి మార్చారు. అయితే.. లోదుస్తుల్లోని వ్యక్తి ఎమ్మెల్యే అని తనకు తెలియదని చెప్పారు పాశ్వాన్.
ఈ విషయమై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తనకు కడుపునొప్పి ఉందని, అందుకే.. లోదుస్తులు ధరించినట్టు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే డయాబెటీస్ పేషెంట్ అని, ఆయన అధిక బరువు కారణంగా దుస్తులతో వాష్ రూమ్ కు వెళ్లలేకపోయారని.. తొందరలో అలా లోదుస్తుల్లో వెళ్లారని మండల్ స్నేహితుడు కునాల్ సింగ్ చెప్పాడు. మొత్తానికి.. ఈ విషయం సోషల్ మీడియాకు చేరడంతో ఎమ్మెల్యేపై సెటైర్లు పేలుతున్నాయి. అండర్ వేర్ తో తిరిగితే.. కడుపు నొప్పి తగుతుందా? అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.