Jaya Prakash Narayana- Jagan: జయప్రకాష్ నారాయణ.. మాజీ ఐఏఎస్ అధికారి. ఏపీలో మేధావి వర్గంలో ముందుండే వ్యక్తి. ఇప్పుడు ఆయన సైతం జగన్ ట్రాప్ లో పడటం ప్రచారం గా మారుతోంది. లోక్ సత్తా పార్టీ పెట్టి.. రాజకీయ నాయకుడిగా జయప్రకాష్ నారాయణ మారారు. అయితే ఆయన మేధావి గానే గుర్తించబడ్డారు. సమకాలీన రాజకీయాలపై అనర్గళంగా మాట్లాడగలరు. మూడు రోజుల కిందట విజయవాడలో జరిగిన ఆప్కాబ్ కార్యక్రమానికి జెపి హాజరయ్యారు. ఆయన వచ్చిన వెంటనే స్టేజ్ పై ఉన్న సీఎం జగన్ లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. పక్కన కూర్చోబెట్టారు. ఏదో విషయాలపై మాట్లాడుకున్నారు.
సాధారణంగా నేతలు కలిసినప్పుడు మాట్లాడుకోవడం సహజం. కానీ జేపీ జగన్ తో వేదిక పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటినుంచి సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోయింది. ప్రో వైసిపి మీడియా గురించి ఇక చెప్పనక్కర్లేదు. బయట నీతులు చెప్పే జెపి ఇక్కడ చేస్తున్నది ఏమిటి అన్న సెటైర్లు వినిపించాయి. జేపీని జగన్ పార్టీలోకి ఆహ్వానించారని.. విజయవాడ టికెట్ ఖరారు చేసారని.. ప్రచారం ఊపందుకుంది. దీంతో అటు జేపీ సైతం ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
సమాజంలో మేధావులను,ఉన్నత స్థాయి వ్యక్తులను ఎలా వినియోగించుకోవాలో జగన్కు తెలుసు. చంద్రబాబు సర్కారులో కీలక కొలువులు వెలగబెట్టిన వారు సైతం జగన్ కు అభిమానులుగా మారిపోయారు.గతంలో చిరంజీవి ఒక్కడినే విందుకు పిలిచి… అటు తరువాత ఆయన వైసీపీలో చేరుతున్నారని ప్రచారం కల్పించారు. రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నట్లుగా మీడియాకు లీకులిచ్చారు. ఇప్పుడు ఆ వంతు జయప్రకాష్ నారాయణ కు వచ్చింది. ఒక్క షేక్ హ్యాండ్ తో షేక్ చేశారు.
అయితే జేపీ వ్యవహార శైలి కూడా ఎవరికి అంతు పట్టదు. రాజకీయంగా ఆయనకు చాలా ఆశలున్నట్టు ఉన్నాయి. గతంలో ఓసారి కూకట్ పల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాతే ఎందుకో రాజకీయంగా రాణించలేకపోయారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రధాని మోడీని పొగుడుతారు. ఒక్కోసారి వివాదాస్పద అంశాల్లోనూ మద్దతు తెలుపుతారు. కానీ బిజెపి నుంచి ఆయనపై అంత సానుకూలత వ్యక్తం కాదు. అయితే ఇప్పుడు జేపీ వైసీపీలోకి వెళ్తాడా అన్న చర్చ ప్రారంభమైంది. పదవుల కోసం ఆయన అంతగా ఎదురు చూస్తున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ ఆయన అభిమానులు మాత్రం జగన్ తో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి తప్పు పడుతున్నారు. జేపీ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిందని బాధపడుతున్నారు.