కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, అత్యవసర సేవలు అందిస్తున్న యంత్రాంగానికి యావత్ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది.
ప్రధాని చెప్పినట్లు సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో నిలబడి.. దేశానికి విశేష సేవలు అందిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టారు. కరతాళ ధ్వనులతో మాత్రమే కాదు… చిన్నా పెద్దా తేడా లేకుండా ఇళ్ల పైకి ఎక్కి ప్లేట్లు, డ్రమ్స్, గిటార్లు వాయిస్తూ సంఘీభావం తెలిపారు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కుటుంబ సమేతంగా తన ఇంటి ఆవరణలో నిలబడి చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ సంఘీభావం తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబ సభ్యులతో కలిసి గంట కొడుతూ.. జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు. ముంబయిలో ప్రజలు భారీ ఎత్తున ఇంటి వరండాల్లో నిలబడి చప్పట్లు కొడుతూ.. వైద్య సిబ్బందిని అభినందించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా ప్రగతి భవన్‌లో సాయంత్ర 5 గంటలకు చప్పట్లు కొట్టి, జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంట మోగించి, జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సీఎం క్యాంపు ఆఫీసులో అధికారులతో కలిసి సరిగ్గా 5 గంటలకు చప్పట్లు కొట్టి జనతా కర్ఫ్యూకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్’ మహమ్మారి తరిమికొట్టేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు.
ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్, తన కుమార్తె.. ఎంపీ సుప్రియా సూలే, కుటుంబ సభ్యులతో కలిసి దేశానికి సేవ చేస్తున్న వైద్య, పారిశుద్ద్య, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవడేకర్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు జనతా కర్ఫ్యూకు చప్పట్లతో మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ఇంటి బాల్కనీల్లో నిల్చొని చప్పట్లు, గిన్నెలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు సైతం చప్పట్లు కొట్టి తమ దేశభక్తి చాటుకున్నారు.
అత్యవసర సేవలు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడుతూ ఇవాళ దేశం మొత్తం ఏకతాటిపైకి రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ దేశం కృతజ్ఞతలు తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విటర్లో స్పందిస్తూ…
‘‘కరోనా వైరస్ మహమ్మారికి ఎదురొడ్డి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ దేశం యావత్తూ కృతజ్ఞతలు చెప్పింది. ఇందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు. మీ హృదయాల నుంచి ఉప్పొంగిన కృతజ్ఞతా నాదం ఇది. అయితే మనం చేయాల్సిన సుదీర్ఘ యుద్ధంలో ఇది తొలి విజయం మాత్రమే. ఇదే దృఢ సంకల్పంతో మనల్ని మనం కట్టడి చేసుకుని సామాజిక దూరాన్ని పాటిద్దాం. సుదీర్ఘ యుద్ధం ముగిసే వరకు ఇదే నిగ్రహాన్ని పాటిద్దాం..’’ అని పిలుపునిచ్చారు.