Badwel Janasena: వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలు ఉప ఎన్నిక రోజురోజుకు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. కరోనాతో మరణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు టికెట్ ఇవ్వడంతో జనసేన పార్టీ పోటీ నుంచి మానవత్వపు కోణంలో తప్పుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని సూచిస్తూ జనసేనాని పవన్ పిలుపు మేరకు టీడీపీ కూడా పోటీ నుంచి తప్పుకుంది.

జనసేన , టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో వైసీపీ ఏకగ్రీవ విజయం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైదొలిగినా నేనున్నాంటూ బీజేపీ ముందుకొచ్చింది. పవన్ పిలుపును పట్టించుకోకుండా బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అనే నినాదంతో బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించింది.
ఈ క్రమంలోనే బీజేపీ నుంచి శుక్రవారం పనతల సురేశ్ నామినేషన్ కూడా దాఖలు చేసి ఏకగ్రీవం కాకుండా నిలబడ్డారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంపై బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ ఎన్నికల బరిలో ఉండడంతో జనసేన ఏం చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా బద్వేలు ఉప ఎన్నికలపై జనసేన తేల్చింది. సంచలన నిర్ణయం తీసుకుంది.
బీజేపీతో పొత్తు ధర్మానికి ప్రాధాన్యమిస్తూ బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీకి తమ క్యాడర్ సహకరిస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన శనివారం బద్వేలు ఉపఎన్నికపై స్పందించారు. బీజేపీ తన పార్టీ పాలసీ ప్రకారం బద్వేలులో పోటీచేస్తుందని.. బీజేపీతో జనసేన కలిసే ఉందని.. బద్వేలులో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇస్తుందని తేల్చిచెప్పారు. అయితే జనసేన పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటుందా? లేదా? అనేదానిపై త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఇక ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ‘బద్వేలు’ ఉప ఎన్నికల ప్రచారానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తామని ప్రకటించారు. మరి ఆయన ఈ ప్రచారానికి వస్తారా? రారా? అన్నది ఉత్కంఠగా మారింది.