Nagababu: మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. కేవలం పార్టీ కోసమే పని చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఆయన ఎంపీగా మరోసారి బరిలో దిగడం ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.ఇటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్త పర్యటనలకు నాగబాబు శ్రీకారం చుట్టారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో పర్యటించారు. పార్టీ శ్రేణులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈ తరుణంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. వైసీపీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
గత కొద్దిరోజులుగా నాగబాబును టార్గెట్ చేసుకొని వైసిపి విస్తృత ప్రచారం చేస్తోంది. ఇటీవల ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొన్ననే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు ఎలాఓటు నమోదు చేసుకుంటారని ప్రశ్నలు వెల్లువెత్తుతాయి.వాస్తవానికి నాగబాబు తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో నాగబాబు కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న ఫోటోను వైసిపి సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. అక్కడ నాగేంద్రరావు పేరిట ఓటు ఉందని.. కానీ ఏపీలో నాగేంద్రబాబు పేరిట ఓటుకు దరఖాస్తు చేసుకున్నారంటూ కామెంట్స్ వచ్చాయి. అదే పనిగా ప్రచారం చేస్తుండడంతో నాగబాబు దృష్టికి ఈ విషయం వెళ్ళింది. దీంతో ఆయన స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఘాటుగా వ్యాఖ్యానాలు చేశారు.
మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తాను అసలు ఓటు వేయలేదని.. ఏపీలో ఓటు వేసి జగన్ ను గద్దెదించాలనుకుంటున్నానని.. అందుకే ఓటు నమోదు చేసుకుంటున్నానని ప్రకటించారు. మరోవైపు పార్టీ శ్రేణులకు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని.. ఇందులో మరో విషయానికి తావు లేదని తేల్చేశారు. ఇప్పటికే పవన్ తెలుగుదేశం పార్టీ విషయంలో విరుద్ధ ప్రకటనలు చేస్తే వారంతా వైసిపి కోవర్టులుగా భావిస్తానని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగబాబు సైతం అదే తరహా హెచ్చరికలు జారీ చేయడం విశేషం. తెలుగుదేశంతో పొత్తును విచ్ఛిన్నం చేయడానికి.. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు వద్ద వివాదాలు సృష్టించేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని.. దానిని ఆదిలోనే చెప్పేందుకు నాగబాబు ఇతర ప్రకటన చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.