Glass Symbol Janasena: 15 ఏళ్ల జనసేన.. గాజు గ్లాస్’ కోసం ఇంకా ఫైటింగ్ యేనా?

2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం రిజిస్టర్డ్ పార్టీగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2019 ఎన్నికల్లో 130 మందికి పైగా అభ్యర్థులు జనసేన తరఫున అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు.

Written By: Dharma, Updated On : February 13, 2024 10:44 am

Glass Symbol Janasena

Follow us on

Glass Symbol Janasena: ఏపీలో జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది. కానీ ఇంతవరకు సరైన విజయం దక్కలేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి పవన్ మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు విజయం సాధించాయి. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వెళ్ళింది. దీంతో పవన్ సైతం గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేశారు. టిడిపి, బిజెపి, జనసేన ఎవరికి వారుగా పోటీ చేయగా.. మూడు పార్టీలకు ఓటమి ఎదురైంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ ఎన్డీఏ లో చేరారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో, అటు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకున్న జనసేన.. పార్టీ గుర్తు విషయంలో మాత్రం తడబడుతోంది. గాజు గ్లాసు గుర్తును దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది.

2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం రిజిస్టర్డ్ పార్టీగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2019 ఎన్నికల్లో 130 మందికి పైగా అభ్యర్థులు జనసేన తరఫున అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. సగానికి పైగా ఎంపి నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు బరిలో దిగారు. గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో జనసేన ఒకే అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది.దీంతో ఎన్నికల నిబంధనల ప్రకారం.. నిర్ణీత ఓట్లు, సీట్లు దక్కకపోయేసరికి జనసేన గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలోకి చేర్చుతూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది.

జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో మాత్రమే గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ.. స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండే చోట సైతం వారికి గాజు గ్లాస్ గుర్తులు కేటాయించే వీలుగా ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు. ఇది ఇబ్బందికరంగా మారనుండడంతో జనసేన ఎలక్షన్ కమిషన్ కు ప్రత్యేక వినతి సమర్పించింది. గత ఏడాది డిసెంబర్ 12న జనసేన నుంచి వినతి రావడంతో ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాజమండ్రి కి చెందిన రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాస్ గుర్తు కోసం తాము ఈసీకి దరఖాస్తు చేసుకున్నామని.. తమ తరువాత దరఖాస్తు చేసుకున్న జనసేనకు ఆ గుర్తు కేటాయించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఈసీ వివరణ ఇచ్చింది. జనసేన నుంచి డిసెంబర్ 12న వినతి వచ్చిందని.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుంచి డిసెంబర్ 20న దరఖాస్తు వచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. దీంతో కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.

అయితే జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది.సరైన విజయం దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఉనికి చాటుతుందని అంతా భావిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గాజు గ్లాస్ గుర్తుపై వివాదం జరగడంతో జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన చుట్టూ నిత్యం కుట్రలు జరుగుతూనే ఉన్నాయని వాపోతున్నారు. హైకోర్టులో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే జనసేనకు గుర్తు వివాదం వీడడం లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సైతం జనసేన ను టార్గెట్ చేసుకొని ఇండిపెండెంట్లు బరిలో దిగారు. గాజు గ్లాస్ గుర్తును పోలి ఉన్న బకెట్ గుర్తును దక్కించుకున్నారు.దాంతో జనసేనకు నష్టం జరిగింది. ఇప్పుడు కూడా ఏపీ ఎన్నికల్లో గుర్తు వివాదాన్ని తెరపైకి తేవడం విశేషం.