NTR Bharat Ratna: ఈ సంవత్సరం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకంగా ఐదుగురు వ్యక్తులకు దేశంలోని అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది.. తెలుగువాడైన పీవీ నరసింహారావుకు కూడా భారతరత్న పురస్కారం అందించి గౌరవించింది. దీనిపై రాజకీయంగా రకరకాల విమర్శలు వస్తున్నప్పటికీ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించింది. నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపకపోయినప్పటికీ దాదాపు అదే అర్థం వచ్చేలాగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. దేశంలో అయిదు వ్యక్తులకు ఒకే సంవత్సరం భారతరత్న పురస్కారం ఇవ్వడం పట్ల టిడిపి నాయకులు పాత డిమాండ్ ను సరికొత్తగా తెరపైకి తీసుకొస్తున్నారు. దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ప్రధాని, ఇతర పెద్దలకు ఆయన లేఖలు రాశారు. ” పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడారు. రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని అందించారు. జనతా వస్త్రాలను పేదలకు అందించారు. 50 రూపాయలకు మోటర్ పంప్ సెంట్లు అందించారు. అంతేకాదు 1989లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ స్థాపించారు. కాంగ్రెస్సేతర కేంద్ర ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయనకు భారతరత్న ఇవ్వాలి” అని కనకమేడల రవీంద్ర కుమార్ తన వరుసలేఖల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.. మరి ఈ లేఖలపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు గానీ.. పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్కి కూడా భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.
కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాసిన నేపథ్యంలో సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం రాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను వారు ఉటంకిస్తున్నారు. “చంద్రబాబు నాయుడుకు భారతరత్న పురస్కారం సీనియర్ ఎన్టీఆర్ కు దక్కాలని ఉద్దేశం ఉండి ఉంటే అది ఎప్పుడో వచ్చేది. కానీ ఆయన పలుమార్లు ఈ విషయాన్ని దాటవేశారు. దీంతో సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం దక్కకుండా పోయింది. అప్పుడు వెన్నుపోటు పొడిచి సీనియర్ ఎన్టీఆర్ చేతిలోని ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు నాయుడు లాగేసుకున్నారు. చివరికి భారతరత్న పురస్కారం కూడా ఆయనకు దక్కకుండా చేశారు. ఇప్పుడు పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం కేంద్రం ప్రకటించగానే తన ఎంపీ తో లేఖలు రాయించారు. ఎన్నికల ముందు సీనియర్ ఎన్టీఆర్ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో పొందేందుకు చంద్రబాబు నాయుడు వేస్తున్న ఎత్తులు ఇవి” అని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, త్వరలో టిడిపి ఎన్డీఏ కూటమిలోకి వెళుతుంది అనే సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కు కూడా భారతరత్న పురస్కారం ఇచ్చే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఐదుగురు వ్యక్తులకు ఈ సంవత్సరం భారతరత్న పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. కొత్తగా ఎవరికి ఇచ్చే ఉద్దేశం లేదనే సంకేతాలు కూడా ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఆకస్మాత్తుగా సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని టిడిపి ఎంపీ లేఖ రాసిన నేపథ్యంలో.. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తే.. ఇది గేమ్ చేంజర్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.