సినిమాల్లో పవర్ స్టార్ అయిన పవన్ కల్యాణ్ పార్టీని స్థాపించి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. అతనికి ఉన్న స్టార్‌డమ్‌తో అలవోకగా అధికారంలోకి వస్తారని అందరూ అనుకున్నారు గత ఎన్నికలకు ముందు. కానీ.. సీన్ అంతా రివర్స్ అయింది. అధికారం మాట దేవుడెరుగు.. కనీసం జనసేన పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ మెజార్టీ స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటును మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగింది.
ఆ తర్వాత ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మున్సిపల్, కార్పొరేషన్లకూ ఎన్నికలు ముగిశాయి. స్థానిక ఎన్నికల్లో జనసేన అక్కడడక్కడ సత్తాచాటింది. ఇంకొన్ని చోట్ల ఓటు బ్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో జనసేనకు ఎక్కడ తమకు బలం ఉందో ఓ క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆ పార్టీ ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టించిందనే చెప్పాలి. ఎక్కువ స్థానాలు గెలవకపోయినా గ్రామాలు పట్టణాల్లో జనసైనికులు హుషారుగా రంగంలోకి దిగి యుద్ధమే చేశారు. కాపు సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని పంచాయతీలను, మున్సిపాలిటీల్లో వార్డులను జనసేన గెలిచి తన ఉనికి చాటుకుంది.
ఇక చాలా గ్రామాల్లో జనసేనకు టీడీపీ లైన్ క్లియర్ చేసేసింది. బలమైన అభ్యర్థి జనసేన వైపు ఉన్న చోట తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడం లేదా బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి పరోక్ష సహకారం అందించింది. కాపు సామాజికవర్గ ఓటర్లలో టీడీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడేందుకు ఆ పార్టీ నేతలు ఎత్తులు వేసినట్లు మొన్నటి ఎన్నికలు స్పష్టం చేసేశాయి. బీజేపీతో పొత్తుతో టీడీపీకి జనసేన దూరంగా ఉన్నప్పటికీ రేపటి రోజున ఆ పార్టీతో పొత్తుపై ఇప్పటినుంచి సానుకూల వాతావరణం కోసమే అధినాయకత్వం నుంచి కింది స్థాయి వరకు అంతా ఎదురుచూస్తున్నారు. జగన్ హవా ముందు నిలబడాలంటే పొత్తులతోనే సాధ్యమని పసుపు దళానికి అవగతం అయినట్లే అని తేలిపోయింది.
ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ తరచూ రావడం మొదలు పెట్టారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ బిజీ కావడంతో పార్టీని చురుగ్గా నడిపించే బాధ్యతలను నాదెండ్ల స్వీకరించినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన స్థానిక ఎన్నికల్లో జనసైనికులు చూపిన ఉత్సాహం నీరుగారకుండా క్షేత్ర స్థాయిలో వారిని కలుస్తూ జోష్ పెంచుతున్నారు. అందుకే ఇటీవల రాజోలులో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన జన సైనికుల కోసం ప్రత్యేకంగా రెండు రోజులు ఆయన తూర్పుగోదావరి జిల్లాల్లో కార్యకర్తలతో గడిపారు. తమ పార్టీకి పట్టున్న చోట మరింతగా బలపడటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని.. మిగిలిన చోట్ల గతంకన్నా మిన్నగా క్షేత్ర స్థాయిలో కమిటీలను బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. మొత్తానికి పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు గోదావరి జిల్లాలే జనసేన ఆయువు పట్టు అని గ్రహించి పవన్ ఇప్పుడు అక్కడి నుంచే రాజకీయం ప్రారంభించినట్లుగా అర్థమవుతోంది.