నిన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న ఏపీ సర్కారు.. ఉన్నఫళంగా సినిమా టిక్కెట్ల విషయం గుర్తుకు వచ్చింది. దీంతో.. రాత్రికి రాత్రే సినిమా టిక్కెట్ల ధరలు ఎంత ఉండాలో నిర్ణయిస్తూ జీవో కూడా జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా.. ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవద్దంటూ ఆ జీవోలో ఆదేశించింది. ఈ నిర్ణయం.. వకీల్ సాబ్ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తోపాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు పెద్ద షాకే ఇచ్చింది.
సహజంగా పెద్ద హీరోల చిత్రాలు ఏవి రిలీజ్ అయినా.. బెనిఫిట్ షోలు వేయడం సర్వ సాధారణం. మొదటి వారం పాటు టికెట్ రేట్లు పెంచుకోవడం కూడా ఎప్పుడూ జరిగేదే. ఈ మేరకు ప్రభుత్వాలే జీవో ఇచ్చాయి. కానీ.. జగన్ సర్కారు ఉన్నట్టుండి రేట్లు ఇంతే ఉండాలంటూ జీవో జారీచేయడం పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అటు ఇండస్ట్రీ నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది.
సినిమా విడుదలకు ముందే.. ఏపీలో టికెట్ ధరలు పెంచొద్దంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే.. ప్రభుత్వ జీవోనే ఉందంటూ డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టుకు వెళ్లారు. దీంతో.. అధికారులు ఇచ్చిన నోటీసులను కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాత్రికి రాత్రి కొత్త జీవోను తెచ్చిందని అంటున్నారు. ఈ జీవో ప్రకారం.. మల్టీఫ్లెక్స్ లలో, కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రీమియం టికెట్ ధర రూ.250 మాత్రమే ఉండాలి. మిగిలిన టిక్కెట్లు రూ.150, 100 మాత్రమే ఉండాలి. సింగిల్ థియేటర్లలో ఏసీ ఉంటే వంద, లేదంటే రూ.60 మాత్రమే ఉండాని ఆదేశాలు జారీచేసింది.
హడావిడిగా తీసుకొచ్చిన ఈ జీవోపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. అధికారం చేతిలో ఉందని జగన్ సర్కారు పవన్ ను ఇలా టార్గెట్ చేస్తోందని అంటున్నారు. ఇతర హీరోల సినిమాలకు అనుమతులు ఇచ్చి, పవన్ సినిమాకు మాత్రమే ఎందుకు అడ్డుకోవడం ఎక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆర్థికంగా దెబ్బతీయాలనే వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపిస్తున్నారు.
ఏపీలో ఇలా ఉండగా.. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోంది. టికెట్ రేట్లతోపాటు బెనిఫిట్ షోల విషయంలోనూ స్వేచ్ఛ ఇచ్చింది సర్కారు.