Pawan Kalyan- Ambati Rambabu: ఏపీలో నోరున్న నేతల్లో మంత్రి అంబటి రాంబాబు ఒకరు. అయినదానికి కానిదానికి ఆయన రంకెలు వేస్తుంటారు. జనసేన అధ్యక్షుడు పవన్ విషయంలో ఆయన చేసే యాగి అంతాఇంతాకాదు. పవన్ అంటేనే మండిపడతారు. పవన్ ఏం పనిచేసినా ఆయనకు నచ్చదు. చివరకు పవన్ చదివే పుస్తకం, ధరించే దుస్తులు, ఆయన ప్రచారానికి తయారు చేసుకున్న రథం .ఇలా దేన్ని అంబటి రాంబాబు విడిచిపెట్టలేదు. ఇక వ్యక్తిగత జీవితంపైనా కామెంట్స్ ను వీడలేదు. పవన్ ను ఎన్ని విధాలా విమర్శలు చేయాలో అన్నిరకాలుగా చేశారు. అందుకే ఆయనపై ఎన్ని వివాదాలు నడిచినా పవన్ ను తూలనాడుతున్నాడన్న ఒకేఒక కాన్సెప్ట్ తో జగన్ మంత్రి వర్గంలో స్థానమిచ్చారు. కీలక పోర్టు పోలియోను సైతం కేటాయించారు. ఇక అంబటి ఆగుతాడా వీరవిహారం చేస్తున్నాడు. అయితే ఈయన చర్యలను గమనిస్తున్న పవన్ రాజకీయంగా చెక్ చెప్పి.. వచ్చే ఎన్నికల్లో ఓటమితో ఇంటికి పంపిస్తే కానీ తిక్క కుదరదన్న నిశ్చయానికి వచ్చారు. అందుకే అంబటిని టార్గెట్ చేసుకున్నారు. కౌలురైతు భరోసా యాత్రను ఏరికోరి అంబటి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో ఏర్పాటుచేయించారు. పవన్ ను అడ్డుకోవడానికి మాచర్లలో విధ్వంసాన్ని సాకుగా చూపినా వర్కవుట్ కాలేదు. పవన్ వచ్చి.. నేరుగా రైతులకు సాయమిచ్చి మరీ సవాల్ చేయగలిగారు. వైసీపీ పై పదునైన కత్తులు విసిరినట్టు పంజా విసరగలిగారు.

అంబటికి పవన్ కొత్త నిర్వచనమిచ్చారు. ఆయన కాపుల గుండెల్లో కుంపటిగా అభివర్ణించారు. పోలవరం పూర్తిచేయలేని ఆయన మంత్రా అంటూ ప్రశ్నించారు. ఆయనవి ఉత్తరకుమార ప్రగల్భాలు అంటూ చెప్పుకొచ్చారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని పరోక్షంగా అంబటిపై ఆరోపణలు చేశారు. అయితే అంబటిని ఏపీ సమాజంలో మరింత పలుచన చేసే ప్రయత్నంలో భాగంగానే పవన్ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. వాస్తవానికి అంబటితో పాటు ఉమ్మడి గుంటూరులో మరో మంత్రి జోగి రమేష్ పై కూడా పవన్ గురిపెట్టారు. వీరిద్దర్నీ వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వకూడదని డిసైడ్ అయ్యారు. అందుకే వారి అవినీతిపై విమర్శలు సందిస్తున్నారు. ఎన్నికల్లో వారిపై ప్రత్యేక వ్యూహంతో పనిచేయాలని భావిస్తున్నారు.
సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పరిస్థితి ఏమంత బాగాలేదు. ఆయన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.అటు పార్టీ వర్గాల్లో కూడా సంతృప్తి వ్యక్తం కాలేదు. దీంతో జగన్ కూడా అంబటిని మార్చుతారన్న టాక్ ఉంది. అయితే అంబటిని మార్చినా.. మార్చకపోయినా.. ఆయన వేరే నియోజకవర్గంలో పోటీచేసినా వదలకూడదన్న నిర్ణయానికి పవన్ వచ్చారు. ఇక్కడ కాపు సామాజికవర్గం అధికం. అందుకే జగన్ అంబటికి ఇక్కడ రెండుసార్లు అవకాశమిచ్చారు. అయితే ఈసారి కాపులు పవన్ వైపు చూస్తుండడంతో జగన్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అంబటి కంటే బలమైన కాపు అభ్యర్థికి రంగంలోకి దించాలని భావిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతారన్న టాక్ ఉంది. ఆయనకు జిల్లాపై మంచి పట్టు ఉంది. అటు టీడీపీ సైతం కన్నా కోసం వెయిట్ చేస్తోంది. గుంటూరు2 రిజర్వ్ లో పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే కన్నా మాత్రం జనసేనలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఒక వేళ కన్నా కానీ పార్టీలోకి వస్తే సత్తెనపల్లి నుంచి బరిలో దించాలని పవన్ యోచిస్తున్నారు. దీంతో అక్కడ సునాయాస విజయం సాధించవచ్చని.. అంబటి రాంబాబు పొలిటికల్ కెరీర్ కు చెక్ చెప్పవచ్చన్న భావనలో పవన్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికైతే పవన్ ను కెలికి అంబటి రాంబాబు ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నారన్న మాట.