Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ తన పంథాను మార్చుకున్నారు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్న నేపథ్యంలో తాను ఎదుర్కొన్న ఆటుపోటులను గుణపాఠంగా మలుచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కుల ప్రస్తావన తీసుకురాకున్నా.. తాను ఒక బలమైన సామాజికవర్గానికి చెందినా ఎక్కడా కుల రాజకీయం చూపలేదు. కులం పట్ల అభిమానమూ చూపలేదు. అయినా సరే అతడి సొంత సామాజికవర్గం మాత్రం వచ్చే ఎన్నికల్లో పవన్ వెంట నడిచే బలమైన సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. అందుకే పవన్ కొత్త స్ట్రాటజీ మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తనతో బీజేపీ కలిసిరాకున్నా.. టీడీపీతో పొత్తు కుదరకపోయినా ఒంటరిలో బరి దిగడానికి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. గత రెండు ఎన్నికలకు భిన్నంగా సాగాలని భావిస్తున్నారు. వైసీపీ, టీడీపీలకు ధీటుగా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. వచ్చే ప్రభుత్వంలో జనసేన బలమైన ముద్ర వేసుకోవాలని.. అసలు జనసేన లేకుండా ప్రభుత్వం ఏర్పాడకూడదన్న కృతనిశ్చయంతో అయితే ఉన్నారు.
ఇప్పటి నుంచే టచ్ లోకి…
సాధారణ ఎన్నికల సమయంలో అధికార, ప్రధాన విపక్షమైన వైసీపీ, టీడీపీలో టిక్కెట్లకు పోటీ ఉంటుంది.ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది. నాయకత్వం కూడా కలవరపాటుకు గురవుతోంది. అందుకే సర్వేలు చేసి మరీ టిక్కెట్లు కేటాయిస్తామని.. గ్రాఫ్ లేని నాయకులను పక్కన పడేస్తానని వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. దాదాపు సగం మందికిపైగా ఎమ్మెల్యేలను పక్కనపెడతారని టాక్ నడుస్తోంది. దీంతో చాలామంది ఇప్పటి నుంచే సేఫ్ జోన్ ఎంచుకుంటున్నారు. అటువంటి వారంతా పవన్ అయితే బాగుంటుందని ఇటువైపు చూడడం మొదలు పెట్టారు. ఇప్పటికే కొందరు పవన్ కు టచ్ లోకి వెళ్లారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, అటు జగన్ హెచ్చరికలతో కొందరు బెంబేలెత్తిపోతున్నారు. అందుకే జనసేన వైపు చూస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు పవన్ ను కలిశారన్న ప్రచారం సాగుతోంది. కొందరు నేరుగా కాకున్నా ఇంటర్నల్ గా జనసేనకు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపు సామాజికవర్గం నేతలు ముందస్తుగానే కలిసి తమ బెర్తులు ఖాయం చేసుకుంటున్నారన్న ప్రచారం అయితే ఉంది. అయితే ఈ విషయంలో పవన్ అచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఎక్కడా ఎవరికీ అభయం ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో చూసుకుందామని.. బేషరతుగా వస్తామంటే మాత్రం ఆహ్వానిస్తామని చెబుతున్నారు. మొత్తానికి అయితే మాత్రం పార్టీ ఆవిర్భావం తరువాత కీలక రాజకీయ నాయకులు ఇప్పుడు జనసేన వైపు చూస్తుండడం శుభ పరిణామమని జనసైనికులు భావిస్తున్నారు.
Also Read: Puvvada on Polavaram: పోల‘రణం’.. ఆంధ్రాకు వరం… టెంపుల్ సిటీకి శాపమేనా!?
ఇదే సరైన సమయమని..
వాస్తవానికి పవన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించలేదు. అప్పటికప్పుడు అధికారంలోకి రావాలని కూడా ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. అయితే ఇది జనసైనికులను సైతం రుచించలేదు. పార్టీ అన్నాక కీలక నాయకులు వస్తే బలోపేతమవుతుంది కానీ.. పవన్ అటువంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. తాను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటానని.. గెలుపోటములతో సంబంధం లేదని.. మధ్యలో పార్టీని వదిలేసే ప్రసక్తి లేదని కూడా చెప్పకొచ్చారు. కానీ పరిస్థితి మారింది. పవన్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అధికార పక్షానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు జనసేనను చూడడం ప్రారంభించారు. అందుకే జనసేన ఓటింగ్ శాతాన్ని సైతం పెంచుకుంది. అయితే అది గెలుపు వరకా లేదా? అన్నది తేలాల్సి ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం జనసేన గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా పవన్ వ్యూహాత్మకంగా సాగుతున్న తీరు కూడా జనసేన పై ప్రజాభిమానం పెరగడానికి ఒక కారణం. ఇంతవరకూ ఎన్ని కష్టాలు ఎదురైనా పవన్ పార్టీని నడిపిస్తున్నారు. తన సొంత ఖర్చుతో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందిస్తున్నారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాల్లో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రజాభిమానాన్ని పెంచుకుంటున్నారు. నాడు పవన్ కు ఉన్నదేమిటి? ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు? ఏం చేస్తాడన్న వారే ఇప్పుడు జనసేనకు పెరుగుతున్న గ్రాఫ్ ను చూసి కలవరపాటుకు గురవుతున్నారు. కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆ 40 నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్…
అయితే ఇప్పటికే పవన్ పార్టీ పరంగా, సామాజికపరంగా తన ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించినట్టు టాక్ నడుస్తోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా; ఉత్తరాంధ్రలో దాదాపు 40 నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది., ఓటు షేర్ ప్రకారం 30 నుంచి 50 వేల వరకూ ఓట్లు సొంతం చేసుకున్నట్టు వివిధ సర్వేల్లో తేలింది. దీనికిగాని బలమైన అభ్యర్థులు తోడైతే మాత్రం వచ్చే ఎన్నికల్లో జనసేన కింగ్ మేకర్ గా నిలిచే అవకాశముంది. అందుకే పవన్ కూడా ఎక్కడా పొత్తుల ప్రస్తావన తేవడం లేదు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం రెండూ కావాలంటే జనసేనకు గెలిపించాలని పిలుపునిస్తున్నారు. అభ్యర్థులతో పనిలేకుండా తనను చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే ఇన్నాళ్లూ అధినేత ఎలా మారాలనుకున్నామో.. ఇప్పుడు పవన్ అదే మాదిరిగా వ్యవహరిస్తుండడంతో జనసైనికులు ఖుషీ అవుతున్నారు. అటు పొత్తులకు టీడీపీ, బీజేపీ ముందుకు వచ్చినా స్వీప్ చేస్తాం.. లేకుంటే స్వతంత్రంగానైనా సత్తా చాటుతామన్న ధీమాలో జనసేన శ్రేణులు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాల్లో సైతం జన సైనికులు స్వచ్ఛందంగా పాల్గోంటున్నారు. యువతలో కూడా ఒక రకమైన మార్పు వస్తోంది. నన్ను అయితే అభిమానిస్తున్నారు. కానీ ఓటు దగ్గరకు వచ్చేసరికి మాత్రం మొండిచేయి చూపుతున్నారంటూ శ్రేణులకు కూడా పవన్ గట్టి హెచ్చరికలే పంపుతున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో పవన్ ను అభిమానించేవారు… అటు ఆయన సొంత సామాజికవర్గంలో మెజార్టీ ప్రజలు మాత్రం వచ్చే ఎన్నికల్లో గుంపగుత్తిగా పవన్ కు ఓటు వేసే అవకాశం ఉంది. అయితే పార్టీ ఆవిర్భావించిన ఇన్నాళ్లకు అధినేత ఫక్తు రాజకీయ నాయకుడిగా మారడంపై మాత్రం జనసేనలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:MP Arvind- CM KCR కేసీఆర్ కు భయపడిపోతున్న ఎంపీ అరవింద్.. సంచలన నిర్ణయం