BJP- Pawan Kalyan: దక్షిణాదిన పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో నిన్న మొన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు మిత్రపక్షంగా ఉంది. పవన్ కూడా బీజేపీతో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు, తాము ఆంధ్రప్రదేశ్‌లో కలిసే పనిచేస్తున్నట్లు చాలా సభల్లో ప్రకటించారు. అయితే బీజేపీ మిత్ర ధర్మాన్ని విస్మరిస్తోంది. ఒకవైపు జనసేన తమకు మిత్రపక్షం అని చెబుతూనే అధికార వైఎస్సార్‌సీపీతో మైత్రి కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనకు కేంద్రం మద్దతు ఎంతో అవసరమని భావించి బీజేపీలో వైరుధ్యానికి దూరంగా ఉంటున్నారు. అడపా దడపా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీపై, అదే సమయంలో బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బయటకు ఇరు పార్టీల మధ్య స్నేహబంధం లేనట్లు కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం మైత్రి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ బీజేపీతో కలిసి పనిచేసిన జనసేనాని ఇటీవల బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఎక్కడా ప్రకటించకపోయినా ఇటీవల పవన్ తమకు ఏపార్టీతో పొత్తు లేదని ప్రకటించడంతో బీజేపీ–జనసేన మధ్య గ్యాప్ వచ్చిందని పొలిటికల్ టాక్?
రాష్ట్రపతి ఎన్నికల కోసం వైసీపీతో మైత్రి..
రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గిరిజన మహిళ ద్రైపది ముర్మును తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇటీవలే నామినేషన్ కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి అధికార ఎన్డీఏ కూటమికి 2 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీతో బీజేపీ మైత్రి కొనసాగిస్తోంది. ఇటీవల బీజేపీ–వైసీపీ అంతర్గత మైత్రి విషయం తెలుసుకున్న పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకత్వాన్ని నిలదీనిసట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు బీజేపీ అధిష్టానం కూడా స్పష్టం చేసింది. దీంతో నిరాశగా తిరిగి వచ్చిన పవన్ తమకు ఎవరితో పొత్తు లేదని ప్రకటించారు.
పవన్‌ను ఇరుకున పెట్టేలా..
పవన్ ప్రకటనతో నొచ్చుకున్న బీజేపీ ఏపీలో ఆయనకు చెక్‌పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జూలై 4న ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. అజాతీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భీమవరంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. జనసేనాని పవన్ సోదరుడు అయిన చిరంజీవిని కార్యక్రమానికి ఆహ్వానించడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది. సినీ నటుడిగా ఆహ్వానిస్తే అందరినీ ఆహ్వానించాలి. కానీ చిరంజీవికి మాత్రమే ఆహ్వానం పంపడం, రాజకీయ పార్టీలను ఆహ్వానించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మిత్రపక్షమైన జనసేనను తిరిగి తమవైపు తిప్పుకునేందుకే చిరంజీవి ద్వారా బీజేపీ రాయబారం నెరుపుతోందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే కార్యక్రమానికి ఇంకా గడువు ఉన్న నేపథ్యంలో పవన్‌కు కూడా ఆహ్వానం పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:YS Sharmila: మళ్లీ వైఎస్ఆర్ పరిపాలన రావాలి..కేసీఅర్ పాలన పోవాలి.. సాధ్యమవుతుందా?