Revanth Reddy- Bhatti Vikramarka: వరుస ఓటములు, గెలిచిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు, సొంత పార్టీలోనే నేతల సిగ పట్లు, ఇన్నేసి కష్టాల మధ్య ఇన్నాళ్లకు కాంగ్రెస్కు ఒక్క చుక్కాని లాంటి నాయకుడు రేవంత్ రెడ్డి రూపంలో దొరికాడు. మొదటినుంచి దూకుడు స్వభావం ఉన్న రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. సాక్షాత్తు సీఎం సొంత ఇలాకా లోనే భారీ బహిరంగ సభ నిర్వహించి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమేననే సంకేతాలు పంపారు. పార్టీకి మరింత జవసత్వాలు తీసుకువచ్చేందుకు ఇతరులకు కూడా కాంగ్రెస్ కండువా కప్పుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లని పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. టీఆర్ఎస్ లోని అసంతృప్తి వాదులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయమని చెప్తున్న బీజేపీకి రేవంత్ రెడ్డి సరైన కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్లో చేరే నాయకులకు టికెట్లు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నట్టు సమాచారం.
భట్టి మాటలతో
రేవంత్ కాంగ్రెస్ లో చేరేందుకు అసలు ఇష్టపడనివారిలో భట్టి విక్రమార్క ఒకరు. అధికారపక్షంతోనూ సయోధ్య నడిపే లౌక్యం ఉన్న నాయకుడు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు, మార్పులు చేర్పులపై కేసీఆర్ ఆహ్వానిస్తే ప్రగతి భవన్ కు వెళ్ళిన కాంగ్రెస్ నాయకుడు. అంతేకాకుండా రేవంత్రెడ్డి లేకుండానే చింతన్ శిబిర్ నిర్వహించిన ఘనాపాటి. ప్రస్తుతం దూకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు అన్ని తానే వ్యవహరిస్తుండడం, మొన్న వరంగల్లో జరిగిన సభలో రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి పచ్చ జెండా ఊపడంతో భట్టి నారాజ్ గా ఉన్నారు. అధికార టీఆర్ఎస్ కోవర్టులు నుంచి వెళ్లొచ్చని మొహమాటం లేకుండా చెప్పారు. రాహుల్ నుంచి ఆ సమాధానం రావడంతో భట్టి విక్రమార్క నుంచి ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు ఖిన్నులయ్యారు.
Also Read: YS Sharmila: మళ్లీ వైఎస్ఆర్ పరిపాలన రావాలి..కేసీఅర్ పాలన పోవాలి.. సాధ్యమవుతుందా?
సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి పలసలను ఆహ్వానిస్తున్న క్రమంలో అతడికి ఎలాగైనా చెక్ పెట్టాలని.. టికెట్ల బాధ్యత ఎవరికీ లేదని, అదంతా అధిష్టానమే చూసుకుంటుందని కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్న నాయకులకు ఆహ్వానం పలుకుతున్నామని, అదే సమయంలో టికెట్లపై మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేమని చెబుతున్నారు. మొన్న భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి గాని అక్కడ లేకపోవడం విశేషం. మరోవైపు తాటి వెంకటేశ్వర్లు ని ఎవరికి చెప్పి పార్టీలో చేర్చుకున్నారని టిపిసిసి మహిళా నాయకురాలు, ములకలపల్లి జడ్పిటిసి నాగమణి ప్రశ్నించారు.
ప్రస్తుతం పార్టీలో చేరిన తాటి వెంకటేశ్వర్లు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారని, నిన్నగా మొన్న వచ్చిన నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేం ఏం కావాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రామన్నగూడెం గ్రామస్తులు ప్రగతి భవన్ కు పాదయాత్రగా వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకుంటే తాటి వెంకటేశ్వర్లు చేసిన ఓవరాక్షన్ వల్ల పార్టీ అభాసుపాలైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తి వాదులు కాంగ్రెస్ లోకి వెళ్తే తమకు లాభం చేకూరుతుందని టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజల్లో మంచి పేరు వస్తున్న నేపథ్యంలో నేతలు సమన్వయంతో వ్యవహరించకుండా పంతాలకు పోతే మరోసారి అధికారానికి దూరం కావాల్సి వస్తుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Amaravati: టీడీపీ నేతలు తగ్గితేనే ‘అమరావతి’ సజీవం.. లేకుంటే కష్టమే..