
ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై తరచూ దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మానవ మృగాల పైశాచిక ఆనందానికి అభాగ్యులు సమిథలవుతున్నారు. అయితే.. కొందరి విషయంలో న్యాయం జరుగుతున్నా.. అయేషా వంటి అభాగ్యుల విషయంలో మాత్రం న్యాయం ఎండమావిగా మారిన పరిస్థితులు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి అమాయకుల కోవకు చెందిన యువతి సుగాలీ ప్రీతి.
కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో 2017లో అనుమానాస్పద రీతిలో చనిపోయిన సుగాలీ ప్రీతి కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. యువతులపై దారుణాలు జరిగిన ప్రతిసారీ ప్రీతి అంశం కూడా తెరపైకి వస్తోంది. కానీ.. న్యాయమే ఆలస్యమవుతోంది. అయితే.. ఈ విషయంపై జనసేన కార్యకర్తలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా.. ప్రీతికి జరిగిన అన్యాయాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారీ గుర్తు చేస్తూనే ఉన్నారు.
ప్రీతిని స్కూల్ యాజమాన్యానికి చెందిన వారే దారుణంగా హతమార్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దోషులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు 2017 నుంచి కోరుతున్నారు. వారికి మొదటి నుంచీ మద్దతుగా ఉన్నారు జనసేన నేతలు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోరాటం చేస్తే.. పోలీసులు వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ.. వారి పోరాటం కొనసాగించారు. ఆ తర్వాత స్పందించిన ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే.. సీబీఐ పరిధిలోకి కేసు వెళ్లిందేగానీ.. విచారణ మాత్రం ముందుకు కదల్లేదు.
తాజాగా.. మళ్లీ జన సైనికులు ఉద్యమం మొదలు పెట్టారు. సుగాలీ ప్రీతి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ చెప్పిన న్యాయం జరగలేదని తీవ్రంగానే విమర్శిస్తున్నారు. ఒక ఆడ పిల్లకు న్యాయం చేయలేని ప్రభుత్వం ఉంటే ఏంటీ.. లేకుంటే ఏంటీ అని ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు స్పందించింది. ‘దిశ’ చట్టం, యాప్ గురించి సమీక్షించిన సమయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రీతి విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ప్రీతి కేసు విషయంలో సీబీఐ విచారణ విషయమై మరోసారి కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత కర్నూలు కలెక్టర్, ఎస్పీ ప్రీతి తల్లిదండ్రులను కలిశారు. కుటుంబానికి 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా.. ప్రీతి తండ్రి రాజునాయక్ కు ఉద్యోగం ఇస్తామని, తల్లి కాలికి శస్త్రచికిత్స చేయిస్తామని వాగ్ధానం చేశారు. ఇవన్నీ జరిగి, ప్రీతిని హత్యచేసిన దండగులకు శిక్ష పడినప్పుడే నిజమైన న్యాయం దక్కినట్టు. అయితే.. ఈ విషయం ఇంత వరకు తీసుకు రావడంలో జనసేన నేతలు, కార్యకర్తల పాత్ర చాలా ఉందనేది విస్మరించలేని సత్యం. ఆ విధంగా.. ప్రభుత్వం నుంచి ఇంకా న్యాయం జరగాల్సి ఉన్నా.. జనసేన మాత్రం తనవంతు న్యాయం చేసిందని అంటున్నారు.