Jana Sena- Nadendla Manohar: జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో ప్రబల పాత్ర పోషించబోతోంది. ఇప్పటికే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళుతున్నారు. వచ్చే దసరా నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ మేరకు పవన్ యాత్రకు రంగం సిద్ధమైంది. ఇక పవన్ కళ్యాణ్ యాత్రలోనే టికెట్ల కేటాయింపు కూడా ఉంటుందని.. పవన్ పర్యటించే నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తారని అంటున్నారు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా కూడా పొత్తులు తేలడం లేదు. వైసీపీని ఓడించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే కీలకమైన నియోజకవర్గాలను, సీనియర్లకు సీట్ల కేటాయింపు చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు సమాచారం.
ఇక జనసేనలో తొట్టతొలి సీటును ఆ పార్టీలో నంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ కు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మేరకు పవన్ యాత్రకు ముందు దీన్ని ప్రకటిస్తారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగనున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెనాలిలో గెలుపు కోసం నాదెండ్ల మనోహర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో పర్యటించిన నాదెండ్ల మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు.

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు తెనాలిలో ఎమ్మెల్యేగా వరుసగా గెలిచారు. ఎన్టీఆర్ హయాం నుంచి నాదెండ్ల కుటుంబానికి ఈ నియోజకవర్గం అండగా ఉంది. ఇక వైఎస్ఆర్ హయాంలో తెనాలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మనోహర్ నాడు అసెంబ్లీ స్పీకర్ గా చేశారు. నాదెండ్ల మనోహర్ 2014లో తెనాలి నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం జనసేనలో చేరారు. 2019లో జనసేన నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జనసేనలో తొలి సీటును నాదెండ్లకే పవన్ కేటాయించబోతున్నారని.. ఈ మేరకు ఆయన నియోజకవర్గంలో ఇప్పటినుంచే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.