JanaSena: తెలంగాణలో ఆ సీట్లపై జనసేన ఫోకస్ పెట్టాల్సిందే..

గ్రేటర్ పరిధిలో కూకట్పల్లి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు బిజెపి పొత్తులో భాగంగా విడిచిపెట్టింది. అక్కడ బిజెపి నుంచి జనసేనలో చేరిన నాయకుడికి టికెట్ దక్కింది. ఈ లెక్కన ఇక్కడ గెలుపు పక్కా చేసుకోవాల్సి ఉంటుంది.

Written By: Dharma, Updated On : November 8, 2023 3:45 pm

JanaSena

Follow us on

JanaSena: తెలంగాణ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎంత? ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతోంది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. బిజెపితో జనసేన పొత్తు కుదుర్చుకుంది. 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలుత 32 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా… బిజెపితో పొత్తు ప్రకటన తర్వాత మనసు మార్చుకుంది. ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ఇలా తీసుకున్న స్థానాల్లో.. జనసేన ఎన్ని చోట్ల గెలుపొందుతుందన్న చర్చ అయితే నడుస్తోంది. ఒకటి, రెండు చోట్ల గెలుపొందితే మాత్రం జనసేన హవా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గ్రేటర్ పరిధిలో కూకట్పల్లి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు బిజెపి పొత్తులో భాగంగా విడిచిపెట్టింది. అక్కడ బిజెపి నుంచి జనసేనలో చేరిన నాయకుడికి టికెట్ దక్కింది. ఈ లెక్కన ఇక్కడ గెలుపు పక్కా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెటిలర్స్ అధికంగా ఉంటారు. గెలుపోటములను నిర్దేశించగలరు. ఏపీ పార్టీగా జనసేనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అటు బిజెపి మద్దతు ఉంటుంది. ఒకవేళ ఏపీలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ జనసేన కు మద్దతు ప్రకటిస్తే.. సునాయాస విజయం దక్కనుందన్న టాక్ నడుస్తోంది. తెలంగాణ ఇన్చార్జి పోటీ చేస్తున్న తాండూర్ లో సైతం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో జనసేన చూపే ప్రభావం బట్టి.. ఏపీ రాజకీయాలు మారనున్నాయి. ఒకవేళ జనసేన ఒకటి, రెండు స్థానాల్లో గెలుపు పొందితే మాత్రం ఏపీలో తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. జనసేనకు భారీగా సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఫెయిల్ అయితే మాత్రం అది కూటమిపై పడే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ సైతం రాజకీయంగా మలుచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే ఎనిమిది స్థానాలను టార్గెట్ చేసుకొని ప్రత్యేక వ్యూహంతో జనసేన ముందుకెళ్తే మాత్రం మంచి ఫలితం ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా కూకట్పల్లి, తాండూరు నియోజకవర్గాల విషయంలో పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెడితే మాత్రం విజయం దక్కుతుంది అన్న టాక్ నడుస్తోంది.

బిజెపితో పొత్తు ఉండి కూడా జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపించకపోతే… ఏపీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కు నైతికపరమైన దెబ్బ అవుతుంది. అదే సమయంలో తెలంగాణలో ఓటమికి పవన్ కారణంగా బిజెపి చెప్పుకునే అవకాశం సైతం ఉంది. అందుకే ఇప్పుడు పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏపీలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ సహకారం తీసుకుంటే.. ఆ పార్టీ సానుభూతిపరులు జనసేనకు ఓటు వేసి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బిజెపి విషయంలో టిడిపికి భిన్న వైఖరి ఉండడంతో సానుభూతిపరులు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఇప్పటికే తెలుగుదేశం, వైయస్సార్ టిపి ఎన్నికల బరి నుంచి తప్పుకున్న క్రమంలో జనసేన పై ఒక రకమైన ఒత్తిడి ఉంది. దానిని ఒకటి రెండు సీట్లు గెలుచుకోవడం ద్వారా అధిగమించాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.