
తెలుగుదేశం శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు అరెస్టుపై జనసేన స్పందన చూస్తుంటే.. ఆ పార్టీ టీడీపీకి మద్దతు కాదని చెప్పడానికే అన్నట్లు తెలుస్తుంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో జగన్ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా.. దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడు అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోంది.
అదే విధంగా ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అచ్చెన్నాయుడు అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయి. ఈ.ఎస్.ఐ.లో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.