Janasena Party: తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు యాక్టివ్ అవుతున్నారు. రాయలసీమలో సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పొత్తులో భాగంగా మొన్నటివరకు టిడిపి ఇచ్చిన సీట్లే తీసుకోవాల్సిన పరిస్థితుల్లో జనసేన ఉండేది. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు శరవేగంగా మారాయి. కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి నేనున్నాను అని భరోసా కల్పించడం ద్వారా సీన్ ను మార్చేశారు పవన్. ఇప్పుడు జనసేన నచ్చి మెచ్చే సీట్లను ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎదురైంది.
రెండు పార్టీల మధ్య పొత్తు ప్రతిపాదన ఇప్పటిది కాదు. చాలా రోజుల నుంచి పొత్తు అన్న మాట వినిపిస్తూనే ఉంది. అప్పట్లో జనసేనకు 18 నుంచి 20 సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అది కూడా ఆ పార్టీకి బలమున్న ప్రాంతంగా ఉన్న ఉభయగోదావరి, విశాఖ జిల్లాలో మాత్రమే సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడిచింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన ప్రాతినిధ్యం ఉండేలా సీట్ల కేటాయింపు జరగనున్నట్లు సమాచారం.
రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో జనసేన సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాయలసీమ వైసిపికి పట్టున్న ప్రాంతం. అక్కడ కూడా జనసేన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నుంచి పలువురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటివారు పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులుగా బరిలో దిగే అవకాశం ఉంది. పవన్ పొత్తు ప్రకటన తర్వాత చాలామంది నాయకులు జనసేనలో చేరేందుకు క్యూకడుతున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ దక్కితే విజయం ఖాయమని వారు భావిస్తున్నారు.
ప్రధానంగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో సైతం మూడు స్థానాలను జనసేన ఆశిస్తున్నట్లు సమాచారం. రాజంపేట, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లోని నేతలు ఉత్సాహంగా ఉన్నారట. ఈ మూడు నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం అధికం. గెలుపోటములను నిర్దేశించగల స్థాయిలో ఉన్నారు. వారు పవన్ నాయకత్వాన్ని ఎక్కువగా అభిమానిస్తున్నారు. అందుకే ఆ సామాజిక వర్గం నేతలను బరిలో దించితే విజయం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాజంపేటలో శ్రీనివాసరాజు, దినేష్, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన బద్వేలులో విజయ జ్యోతి యాక్టివ్ గా ఉన్నారు. ఆమె గతంలో తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మైదకూరులో సైతం సీనియర్ నేత ఒకరుపోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తానికైతే రాయలసీమలో సైతం జనసేన నేతలు యాక్టివ్ గా మారుతుండడం విశేషం.