Rajinikanth: దర్శకుడిని అలా అవమానించడం తగదు.. ఇలా రెండోసారి జరిగింది అంటూ రజనీకాంత్ పై ట్రోలింగ్

రజినీ చేసిన వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంత మంది రజినీ సింప్లిసిటీని అలానే ఆయన ముక్కుసూటి వ్యక్తిత్వాన్ని పొగుడుతున్నారు.

Written By: Neelambaram, Updated On : September 19, 2023 7:07 pm
Follow us on

ఒక సినిమా సక్సెస్ సాధించింది అంటే…అందులో హీరో హీరోయిన్లు కన్నా కూడా దర్శకుడి ప్రతిభే ఎక్కువ ఉంటుంది. ఒక సినిమాకి కనిపించని హీరో డైరెక్టర్. కాగా అలాంటి డైరెక్టర్ ని రజనీకాంత్ అవమానిస్తున్నారు అని సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక పెద్ద వార్ జరుగుతోంది.

అనేక ఫ్లాపుల తర్వాత రజినీకాంత్ కి జైలర్
రూపంలో ఈ మధ్య బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. నెల్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వరుణ్ డాక్టర్ తో సూపర్ హిట్ అందుకున్న నెల్సన్ ఆ తరువాత విజయ్ తో తీసిన బీస్ట్ సినిమాతో మాత్రం ఫ్లాప్ అందుకున్నారు. ఇక తన తదుపరి సినిమా తో తప్పక బ్లాక్ బస్టర్ సాధించాలి అనే కసితో జైలర్ సినిమాని ఓ రేంజ్ లో తెరకెక్కించారు ఈ దర్శకుడు. ఇక ఆయన దర్శకత్వానికి తోడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్టింగ్ ఈ సినిమా కి బ్యాక్ బోన్ గా నిలిచాయి.

ఇక ఈరోజు ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో చిత్ర బృందంలో సభ్యులకు ఒక బంగారు నాణెం, షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ఎప్పటిలాగే తన చమత్కారంతో దాపరికం లేకుండా అన్ని విషయాలు చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ రజనీకాంత్ ఏమన్నారంటే..

‘కళానిధి మారన్‌ సర్‌కి థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నాను. ఆడియో లాంచ్‌తో మొదలు పెట్టి అన్నింటిలోనూ ఆయన మార్క్ చూపించారు. సినిమా హిట్ అవ్వగానే ఆర్టిస్టులందరినీ పిలిచి విందు భోజనం పెట్టారు. తర్వాత నాకు, డైరెక్టర్‌కి, అనిరుధ్‌కి కార్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన కారులోనే వచ్చాను. నేను ధనవంతుడినని భావిస్తుంటాను. నేను ఆ కారులో కూర్చున్నప్పుడు కూడా అలాగే అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఇక్కడి వరకు రజనీకాంత్ స్పీచ్ బాగానే ఉన్నా ఆ తరువాత ఆయన దర్శకుడి పై చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం వివాదానికి దారి తీస్తున్నాయి.

రజనీకాంత్ మాట్లాడుతూ..’సినిమా పూర్తయిన తరవాత ఎలా ఉందని సెంబియన్, కన్నన్‌ను కళ సర్ అడిగారు. చాలా బాగుంది సర్ అని కన్నన్ అన్నాడు. నువ్వు నెల్సన్ స్నేహితుడివి, నువ్వు అబద్ధం చెప్పే అవకాశం ఉంది.. సెంబియన్ నువ్వు చెప్పు అన్నారు. వెంటనే సెంబియన్ యావరేజ్ సర్ అన్నాడు. నిజం చెప్పాలంటే రీరికార్డింగ్‌కు ముందు నాకు కూడా సినిమా అబోవ్ యావరేజ్ అనిపించింది. కానీ అనిరుధ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. అసలు ఏం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అతను ఇప్పుడు నా కొడుకు. నాకు హిట్టు ఇచ్చాడు, అతడి ఫ్రెండ్ నెల్సన్‌కు హిట్టు ఇచ్చాడు’ అని రజనీకాంత్ వెల్లడించారు.

కాగా రజినీ చేసిన వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంత మంది రజినీ సింప్లిసిటీని అలానే ఆయన ముక్కుసూటి వ్యక్తిత్వాన్ని పొగుడుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా తాను ఎబోవ్ యావరేజ్ అవుతుందని అనుకున్నాడని నిజం చెప్పాడంటూ అంటున్నారు. కానీ మరోపక్క చాలా మంది మాత్రం దర్శకుడిని అలా అవమానిస్తారా? అంటూ విమర్శిస్తున్నారు.

గతంలో కూడా రజనీకాంత్ ఇలానే భాషా గురించి చెప్పాడని, ముందు యావరేజ్ అవుతుందని అనుకున్నాడట. కానీ దేవా ఇచ్చిన ఆర్ఆర్ వల్లే బ్లాక్ బస్టర్ అయిందంటూ నాడు రజినీ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఇలా అనడం ఆ చిత్ర దర్శకులను కించపరిచినట్టు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి కొంతమంది అసలు చెప్పాలి అంటే జైలర్ కథ కొత్తదేమీ కాకపోయినా, నెల్సన్ టేకింగ్, డార్క్ కామెడీ వల్ల సినిమా హిట్ అయిందని కానీ రజిని ఆయనకు క్రెడిట్ ఇవ్వకపోవడం బాధాకరమని పోస్టులు వేస్తున్నారు.