Kodali Nani- Jana Sena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ 2024 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతుంది. ఈసారి 175 సీట్లు గెలవాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆ పార్టీని 2024లో గద్దె దించుతామని, జనసేన అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీలోని కీలక నేతలను వచ్చే ఎన్నికల్లో ఓడించేలా వ్యూహ రచన చేస్తున్నారు. వైసీపీకి బలమనుకున్న నేతలను ఓడించడం ద్వారా ఆ పార్టీని దెబ్బతీయాలని జనసేనాని ప్రణాళిక రూపొందిస్తున్నారు.

కొడాలి నానికి చెక్..
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీలో బలమైన నేత, మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. విపక్షాలపై తన నోటిదురుసు తనంతో ఏకిపారేస్తున్నారు. టీడీపీ నేతలనైతే ఓ ఆట ఆడుకుంటున్నారు. దీంతో ముందుగా కొడాలికి చెక్ పెట్టాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. ఈమేరకు అధికార పార్టీకి చెందిన, కొడాలి నానికి అనుచరులుగా ఉన్న వారినే జనసేనలో చేర్చుకుని షాక్ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు పాలంకి బ్రదర్స్‌గా పేరున్న సారధిబాబు, మోహన్‌బాబు. నాదెండ్ల మనోహర్ వారిద్దరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి సభ్యత్వం ఇచ్చారు.
పవన్‌ను విమర్శిస్తున్నందుకే...
2019 నుంచి పాలంకి బ్రదర్స్ వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే కొడాలి నాని పవన్ కల్యాణ్‌పై చేస్తున్న విమర్శలను వారు సహించలేక పార్టీని వీడినట్లు తెలిపారు పాలంకి బ్రదర్స్. జనసేనలో చేరిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాము కొడాలి నాని విజయానికి పనిచేశామని, అయితే నాని శృతి మించి చేస్తున్న వ్యాఖ్యలు తమను బాధించాయని చెప్పారు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, రాజకీయ విమర్శలు చేయమని తాము సూచించినా నాని వినిపించుకోలేదని తెలిపారు. అందుకే వైసీపీని వీడి జనసేనలో చేరామని తెలిపారు.
‘కొడాలి’ని ఢీ కొట్టేదెవరు?
గుడివాడలో కొడాలిని ఢీకొట్టే నేతల కోసం కూడా జనసేనాని జల్లెడ పడుతున్నారు. తమ పార్టీతోపాటు ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను గుర్తిస్తున్నారు. వారిలో వచ్చే ఎన్నికల్లో ఎవరిని నానిపై నిలబెట్టాలని సమాలోచన చేస్తున్నారు. అంగ, ఆర్థిక బలం ఉండడంతోపాటు కొడాలి మాటకు మాట సమాధానం చెప్పే అభ్యర్థి కావాలనుకుంటున్నారు. అలాంటి వారు ఇతర పార్టీలో ఉన్నా జనసేనలో చేర్చుకునేందుకు పార్టీ నేతలను పురమాయించారు.
పాలంకి బ్రదర్స్‌నే..
కొద్దిరోజుల క్రితం పాలంకి సారధిబాబు, మోహన్ బాబు జనసేన పార్టీలో చేరారు. కొడాలినానిపై పోటీచేసేందుకు సరైన అభ్యర్థి పాలంకి బ్రదర్సేనని పవన్ భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పాలంకి బ్రదర్స్ లో ఒకరు కొడాలిపై పోటీకి దింపాలని భావిస్తున్నారు. తాజాగా దేవినేని అవినాష్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న అవినాష్ గతంలో టీడీపీ తరఫున కొడాలిపై పోటీచేశారు. తర్వాత వైసీపీలో చేరారు. ఆయనను జనసేనలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో తిరిగి కొడాలి నానిపై బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా పవన్ చేస్తున్నారట. మొత్తంగా 2024 ఎన్నికల్లో నానిని ఓడించడమే లక్ష్యంగా జనసేనాని పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

జనసేన వైపు అసంతృప్తుల చూపు..
వైసీపీలో అసంతృప్త నేతల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై , పార్టీపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే కారణమని చెబుతూ ఉండటం, వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలకు పార్టీ టికెట్లు ఇచ్చేది లేదని ప్రకటనలు చేస్తుండటంతో ఎమ్మెల్యేలు, నాయకులలో అసంతృప్తి గూడు కట్టుకుంటున్నది. ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించకుండా ఎంత సేపూ తమనే ప్రజల ముందు పని చేయని నేతలుగా నిలబెట్టడం పట్ల వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే వారు పక్క చూపులు చూస్తున్నారని పార్టీ శ్రేణులే బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. తాజాగా కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ నేత, గత రెండు ఎన్నికలలోనూ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన బొంతు రాజేశ్వరరావు జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోవడం ఖాయమని వైసీపీ, జనసేన వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అసలు వైసీపీ అసంతృప్త నాయకులు మొదటిగా తెలుగుదేశం వైపే చూడాల్సి ఉన్నప్పటికీ, ఇంత కాలం ఆ పార్టీపై, ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆ పార్టీలో తమకు సముచిత స్థానం లభిస్తుందా అన్న అనుమానం వారిలో ఉండటంతోనే జనసేన వైపు చూస్తున్నరని కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరినా, ఆ పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్న నాయకులను కాదని తమకు చాన్స్ రాదన్న అనుమానం కూడా వారిని జనసేన వైపు చూసేలా చేస్తోందని అంటున్నారు. గుడివాడకు చెందిన ఇంకొందరు వైసీపీ నేతలకు కూడా జనసేనతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.