Pawan Kalyan- TV Channel: ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ ఎంత ముఖ్యమో.. ప్రచారం కూడా అంతే ముఖ్యం.. పార్టీ తరఫున చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సొంత మీడియా సంస్థ ఉండాల్సిన ఆవశ్యకత ప్రతీ పార్టీకి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని పార్టీలకు ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నాయి. కొన్ని పార్టీలకు రెండూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న జన సేనాని పవన్ కళ్యాణ్ కూడా సొంత మీడియా సంస్థను స్థాపించే ఆలోచన చేస్తున్నారన్న టాపిక్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశమైంది.

2017లోనే ఆలోచన..
ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి టీడీపీ, బీజేపీకి పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉన్నారు. అయితే నాటి టీడీపీ ప్రభుత్వం పనితీరు నచ్చకపోవడంతో 2017 నుంచి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు, పార్టీ బలోపేతానికి, తన గళాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సొంత టీవీచానల పెట్టాలని భావించారు. ఇందుకోసం ప్రముఖ తెలుగు న్యూస్ చానళ్లకు చెందిన ఇద్దరు అధినేతలతో కలిసి చానల్ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ క్రమంలో కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఆ రెండు చానళ్ల అధినేతలను కూడా ఆహ్వానించారు. అంతకుముందు, ఈ ఇద్దరు అధినేతలు పవన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని భావించారు. కానీ కారణం తెలియదు కానీ చానల్ ఏర్పాటు కాలేదు. దీంతో సొంత మీడియా లేకుండానే పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమికి సొంత మీడియా లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. టీడీపీనీ, వైసీపీకి మీడియా సంస్థలు ఉండడం, వారి కార్యక్రమాలనే ప్రచారం చేసుకోవడంతో పవన్ గళం జనంలోకి ఎక్కువగా వెళ్లలేదన్న అభిప్రాయం కూడా పార్టీ క్యాడర్‌లో ఉంది. ఓటమిపై నిర్వహించిన సమీక్షలోనూ నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చానల్ స్థాపనపై మళ్లీ ఆలోచన..
ఆంధ్రప్రదేశలో అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ దూకుడు పెంచారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకుపైగా సమయం ఉంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లాగా పరాభవం ఎదురు కాకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో బలమైన ఎమ్మెల్యేలు, మంత్రులను ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నార. ఈక్రమంలో పార్టీ కార్యక్రమాలను, పవన్ గళాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందకు సొంత చానల్ ఏర్పాటుపై కూడా కసరత్తు షురూ చేసినట్లు తెలిసింది.
ప్రచారానికి చానల్ అవసరమని.
రాజకీయ పార్టీలకు పబ్లిసిటీ కచ్చితంగా కావాలి. టీవీ చానల్స్, న్యూస్ పేపర్ల ద్వారా నాయకులకు బాగా ప్రచారం వస్తుంది. ప్రముఖుల విషయంలో ఏం జరిగినా మీడియా హైలెట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ టాప్ హీరో. కాబట్టి ఆయన విషయంలోను మీడియా ఎప్పుడు బాగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే ధీమాతో 2019 ఎన్నికలకు వెళ్లారు జనసేనాని. కానీ సొంత మీడియా లేకపోవడం ఓటమికి ఒక కారణంగా గుర్తించారు. దీంతోనే 2024 ఎన్నికల నాటికి సొంత చానల్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికై అధికార పార్టీ మీడియా చానల్, పత్రిక విపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పవన్‌పై వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ మీడియా కచ్చితంగా టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు పొగుడుతున్న వారే అప్పుడు తిట్టవచ్చు. ఇది జనసేనకు నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సొంత మీడియా ఉంటే మంచిదని పవన్ కళ్యాణ్‌కు ఫిక్స్ అయ్యారని సమాచారం.
అన్నలెజినోవా సారథ్యంలో ఏర్పాటు..
కాగా, పవన్ ఇప్పటికే చానల్ ప్రారంభించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన టీవీ చాన ల్ బాధ్యతలను ఆయన మూడో భార్య అన్నలెజినోవా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. చానెల్ బాధ్యతలతోపాటు ఎండీగా కూడా అన్నలెజినివానే ఉంటారని ప్రచారం జరుగుతోంది. జనసేన కార్యక్రమాలను, పవన్ గళాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ న్యూస్ చానల్ పనిచేస్తుందని మీడియావర్గాల టాక్. అయితే అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే చానల్ ప్రారంభమవుతుందని జన సైనికులు కూడా వెల్లడిస్తున్నారు.