
Janasena: వచ్చే ఎన్నికల్లో జగన్ 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచి తీరుతామని చెబుతున్నారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. అయితే ఇలా అనే దానికంటే తనకున్న రాక్షస సైన్యం తనను గెలిపిస్తుందన్న ప్రగాడ నమ్మకమే ఎక్కువగా ఉన్నట్టుంది. అయితే ఎవరి నమ్మకం వారిది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రజావ్యతిరేకత పెల్లుబికుతోంది. విపక్ష నాయకుల కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. అదే సమయంలో అధికార పక్షం సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. కనీసం కుర్చీలు కూడా నిండడం లేదు. సహజంగా ఇది వైసీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ కు కలవరపాటుకు గురిచేస్తోంది. వచ్చే ఎన్నికల్లో దెబ్బ తప్పదు అని వారు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.
సాధారణంగా జనసేన తన కార్యక్రమాలకు జనాలను సమీకరించదు. అది పార్టీ ఆవిర్భావం నుంచి వస్తున్న ఆనవాయితీ. పవన్ బయటకు వచ్చి ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ అవుతూ వస్తోంది. జన సైనికులు అంకిత భావంతో వ్యవహరించి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తుంటారు. అయితే నిన్నటి మచిలీపట్నం సభ మాత్రం జనసేన చరిత్రలోనే నిలిచిపోతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతలా జనం వచ్చింది ఎప్పుడులేదు. అయితే జనసేన నిర్వహించే ప్రతీ కార్యక్రమం దిగ్విజయమైంది. మొన్నటి రణస్థలం యువశక్తి శ్రీకాకుళంలో నిర్వహించినా జనసైనికులు వ్యయప్రయాసలకోర్చి అక్కడకు చేరుకున్నారు. జనసేనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో జనం చూస్తే ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. పవన్ కు దారిపొడవునా ప్రజలు మంగళహారతులిచ్చి మరీ స్వాగతం పలికారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు పవన్ రాకకోసం ఎదురుచూశారు. దారిపొడవునా జనమే నిలిచి నీరాజనాలు పలికారు. వారాహి వాహనం వెళ్లలేని స్థితిలో పవన్ కాన్వాయ్ లోకి మారాల్సి వచ్చింది. పవన్ రాక ఆలస్యమైనా సమావేశ ప్రాంగణంలో లక్షలాది మంది జన సైనికులు వేచిచూడడం కనిపించింది. జనసేన ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఒకటి మాత్రం స్పష్టమవుతోంది. జనాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వారిలో ఉన్న అసంతృప్తితోనే ప్రజలు స్వచ్ఛందంగా విపక్ష నేతల కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అటు చంద్రబాబు రోడ్ షోలు, కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి. అటు లోకేష్ పాదయాత్రను తక్కువ చేసి చూపించాలన్న వైసీపీ ఆలోచనలకు మించి జనాలు వస్తుండడం గమనార్హం. అదే లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేస్తూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. తాయిలాలు పంచి మరీ ఆహ్వానించినా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఒక విధంగా చెప్పాలంటే జనసేన పదో ఆవిర్భావ సభ ప్రభుత్వ ప్రజావ్యతిరేకతకు నాంది పలికిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.