Janasena Alliance: ఏపీలో ఇప్పుడు ‘పొత్తు’ రగడ పులుముకుంది. జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య అసలు అలయన్స్ ఉందా..? లేదా..? అనే విషయంపై ఇరు పార్టీల నేతలు గందరగోళంలో పడ్డారు. పార్టీ అధినేతలది ఓ మాట.. కిందిస్థాయి నాయకులతో మరో మాట ఉండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. జనసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు చంద్రబాబు సంకేతాలు పంపుతుండగా.. జనసేన అధినేత పవన్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.. అటు బీజేపీ నాయకులు తమది జనసేనతోనే పయనం అంటుండగా.. జనసైనికులు మాత్రం కమలం పార్టీ నాయకులను విమర్శిస్తున్నారు. కానీ పవన్ మాత్రం బీజేపీతో పొత్తు కొనసాగుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఏ పార్టీతో కలిసి వెళ్తుంది..? ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది..? అనే విషయంపై అయోమయానికి గురవుతున్నారు. కానీ కొందరు జనసేన నాయకులు మాత్రం టీడీపీతో పొత్తు కన్ఫామ్ అని నిర్ణయానికి వస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయముంది. కానీ ఏపీలో ఇప్పడి నుంచి పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన వైసీపీని ఓడించాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరముందని కొందరు నాయకులు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీలు ఒంటరిగా వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు జనసేన వైపే చూస్తున్నాయి. కానీ జనసేన అధినేత బీజేపీ విషయంలో క్లారిటీ ఉన్నా టీడీపీ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కానీ కొందరు జనసైనికులు మాత్రం టీడీపీ కంటే బీజేపీ నాయకులపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో బీజేపీతో చాలా ఓట్లు కోల్పోయామని అంటున్నారు.
ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలోని జనసైనికులు తమకు బీజేపీతో పొత్తు ఉండదని క్లారిటీగా వచ్చారు. ఈ మేరకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఇన్ చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ వల్ల తాము మైనారిటీ ఓట్లు కోల్పోతామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు దూరమవుతున్నామన్నారు. అంతేకాకుండా పవన్ ను ఇతర పార్టీల నాయకులు తిడితే ఏమాత్రం స్పందించని బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటామని అంటున్నారు. అయితే బీజేపీతో పొత్తు లేదని బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తాము జనసేనతో కలిసే ఉంటామని అన్నారు.
ఇక బొలిశెట్టి వ్యాఖ్యలపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. తమ పార్టీ బీజేపీతోనే పొత్తు ఉంటుందన్నారు. కొందరు నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, అవి పార్టీ విమర్శలుగా అనుకోవడం లేదని అన్నారు. ఇలా అధిష్టానం బీజేపీతో పొత్తు అని చెబుతూ.. ద్వితీయ శ్రేణి నాయకులు కమలంపై విమర్శలు చేస్తుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు కొందరు జనసేన నాయకులు మాత్రం టీడీపీతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని అంటున్నారు. మరి ఫ్యూచర్లో పవన్ జనసైనికులను ఎలా మెప్పిస్తారో చూడాలి.