Jagdeep Dhankhar: ఎన్డీఏ పక్షం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్ ను ప్రకటించింది. ఈయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో చాలా డ్రామానే నడిచింది. ఒక దశలో దక్షిణాదికే ఆ పదవి అని ప్రచారం కూడా సాగింది. తిరిగి వెంకయ్య నాయుడుకో లేక తెలంగాణ గవర్నర్ తమిళిసైకో అనే వాదనలు కూడా వచ్చాయి. బీజేపీ అధిష్టానం కూడా ఆ దిశగానే అడుగులు వేసినట్లు కనిపించింది. కానీ చివరి క్షణంలో ఏం జరిగిందో ఏమో కానీ బెంగాల్ గవర్నర్ ను ఆ పదవి వరించడం చర్చనీయాంశంగా మారింది.
సుపుర్ శర్మ వ్యాఖ్యలతో ముస్లిం దేశాల్లో పెల్లుబికిన ఆవేశాల కారణంగా ఈ సారి ఉపరాష్ట్రపతి పదవి ముస్లిం వర్గానికే అని అంతా భావించారు. ఈ మేరకు కేంద్ర మంత్రిగా ఉన్న ముక్తార్ అబ్బాస్ నక్వీని ఆ పదవికి రాజీనామా కూడా చేయించారు. దీంతో ఈసారి ఆ పదవికి ఆయనే అర్హుడని అందరు ఊహించారు. కానీ ఇక్కడే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అధిష్టానం ఓ షాక్ ఇచ్చినట్లు చేసింది. బెంగాల్ గవర్నర్ ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడంతో ఆయనకు కూడా ఈ విషయం తెలియదనే వాదన వినిపిస్తోంది.
Also Read: PV Sindhu: తెలుగుతేజం పీవీ సింధు సాధించింది
మరోవైపు జగదీప్ ధన్ కర్ మాత్రం బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చుక్కలు చూపెడుతున్నారు. పరిపాలన విషయంలో ఎక్కడ కూడా తగ్గేదే లేదని నిరూపిస్తున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా మదిలో ఆయన పేరు మెదిలినట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవికి ఆయన న్యాయం చేశారని భావిస్తున్నారు. అందుకే ఆయన పేరు ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై బీజేపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనలో తనదైన ముద్ర వేయిస్తున్న గవర్నర్ ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
మొత్తానికి ఇప్పుడు జగదీప్ ధన్ కర్ పేరు మారుమోగుతోంది. గవర్నర్ గా పాలన సాగించే ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి దక్కడం విశేషం. రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆలోచించినా ఎవరి ఊహలకు కూడా అందడం లేదు. కానీ మోడీ, షా ద్వయం ఏం ఆలోచించారో అంతుచిక్కడం లేదు. భవిష్యత్ కోసం జగదీప్ ధన్ కర్ ను ఎలా వాడతారో కూడా తెలియడం లేదు. ఏదిఏమైనా ఉపరాష్ట్రపతి పదవి విషయంలో బీజేపీ అధిష్టానం మదిలో ఏముందో కూడా ఎవరికి తట్టడం లేదు. జగదీప్ ధన్ కర్ అదృష్టం దశ తరిగినట్లు కనిపిస్తోంది.