Jagan YCP Ministers : ఉత్తరాంధ్రలో మంత్రులు ఎదురీదుతున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదా? జగన్ తన వర్కుషాపులో ఆ మంత్రులకు ఇదే చెప్పారా? పనితీరు మార్చుకోవాలని బాహటంగానే చెప్పేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉమ్మడి విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొరలు ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్, ముత్యాలనాయుడు కేబినెట్ లో కొనసాగుతున్నారు. అయితే ఈ ఐదుగురు మంత్రులకు వచ్చే ఎన్నికల్లో ముచ్చెమటలు తప్పవని అధినేత జగన్ కు నివేదికలు వెళ్లాయట. అటు ఐ ప్యాక్ టీమ్ తో పాటు నిఘా వర్గాల హెచ్చరికలతో జగన్ సుతిమెత్తగా హెచ్చరించారుట. మీరు అలెర్ట్ కాకుంటే ఇబ్బందులు తప్పవని స్వయంగా జగనే చెప్పేసరికి వారికి నోటి మాట రాలేదట.
జగన్ కేబినెట్ లో కొనసాగింపు లభించిన అతి కొద్ది మంత్రుల్లో బొత్స ఒకరు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. తొలి కేబినెట్ లో కీలకమైన పోర్టు పొలియో దక్కించుకున్న ఆయన.. మలి కేబినెట్ లో కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఆయన ఇష్టమైన పోర్టు పోలియో కాకుండా.. విద్యాశాఖను అప్పగించారు. ఆయన అయిష్టంగానే మంత్రి పదవి స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే బొత్స విజయనగరానికి సామంత రాజు. ఆయన కుటుంబ ప్రాబల్యం ఎక్కువ. తాను చీపురుపల్లి ఎమ్మెల్యే.. ఆపై మంత్రి, సోదరుడు బొత్స అప్పలనర్సయ్య గజపతినగరం ఎమ్మెల్యే. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్, సమీప బంధువు, వరుసకు సోదరుడు అయిన బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నా వారంతా బొత్సకు ఎదురు తిరిగే దమ్ము దైర్యం లేదు. అయితే ఇటీవల జిల్లాపై బొత్సకు పట్టు తప్పుతోంది. అటు కుటుంబంలో కూడా ఆధిపత్య పోరు ప్రారంభమైంది.పైగా బొత్స తన సొంత నియోజవర్గాన్ని పట్టించుకోవడం మానేశారు. అక్కడ మేనల్లుడుకు అప్పగించారు. దీంతో కేడర్ లో ఒకరకమైన నైరాశ్యం ఏర్పడింది. ప్రజల్లో కూడా అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పైగా అక్కడ టీడీపీ ఇన్ చార్జి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున యాక్టివ్ గా పనిచేస్తున్నారు.
మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కూడా ఏమంతా బాగాలేదు, పేరుకే మంత్రి కాని.. ఆయన దగ్గర ఎటువంటి పవర్ లేదని టాక్ నడుస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి తోక కట్ చేశారన్న ప్రచారం సొంత పార్టీలోనే ఉంది. ఆయనకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై పట్టుంది. కానీ ఇతర నియోజకవర్గాల్లో తలదూర్చకూడదని కండీషన్ పెట్టి మంత్రి పదవి ఇచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బోటాబోటీ మెజార్టీతో గెలుపొందారు ఆయన. ధర్మానపై చాలా హోప్స్ పెట్టుకున్న నియోజకవర్గ ప్రజలు ఆ స్థాయిలో పనులు జరగకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు.పైగా ధర్మాన కుటుంబంలో చిచ్చు రేగిందని.. మంత్రి పదవి ఊడిపోవడంతో సోదరుడు కృష్ణదాస్ కోపంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. మరోవైపు స్పీకర్ తమ్మినేనితో ధర్మానకు పొసగడం లేదు. ఇద్దరు నేతలు ఒకరికొకరు పొగ పెట్టుకుంటున్నారు. అటు ధర్మాన సైతం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఉన్నత స్థాయి రివ్యూలకు హాజరుకావడం లేదు. దీంతో ఆయనపై హైకమాండ్ కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్లింది.
శ్రీకాకుళం .జిల్లాకు చెందిన మరో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరిస్థితి కూడా బాగాలేదు. ఆయన సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ప్రదర్శిస్తున్న దూకుడు ఆయనకు మైనస్ పాయింట్ గా మారింది. ప్రధానంగా ఆయనతో పాటు అనుచరుల చుట్టూ అవినీతి ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. నియోజకవర్గంలో భూదందాలు, సెటిల్మెంట్లో మంత్రి పరోక్షంగా ఎంటరవుతున్నారన్నటాక్ నడుస్తోంది. చివరకు అది మావోయిస్టుల హెచ్చరికల వరకూ వెళ్లడం హాట్ టాపిక్ మారింది. ఆయన పరపతిని మసకబార్చింది. విపక్షాలకు ఆయుధమైంది. ప్రజల్లో కూడా చులకన చేసింది. అయితే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయడం లేదన్న టాక్ అయితే ఉంది. ఎన్నికల తరువాత పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యమిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అటు ప్రజలతో మమేకం కాలేకపోతున్నారన్న విమర్శ ఉంది. అదేనిఘా వర్గాలు పార్టీ హైకమాండ్ కు నివేదించాయని తెలుస్తోంది.
ఉమ్మడి విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యవహార శైలిపై కూడా హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో జగన్ అమర్నాథ్ కు అవకాశమిచ్చారు. కేబినెట్ లో చిన్న వయసు కూడా అమర్నాథ్ దే. కానీ ఆయన నోటి నుంచి పెద్ద పెద్ద మాటలు వస్తుంటాయి. ఈ క్రమంలో పార్టీని ఇరుకున పెడుతుంటారన్న టాక్ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంటారు. విలేఖర్ల సమావేశం పెట్టి మరీ తూలనాడుతుంటారు. అయితే ఆయన నిర్వర్తిస్తున్న ఐటీ శాఖపై మాత్రం పట్టు సాధించలేకపోయారు. అటు సొంతనియోజకవర్గ అనకాపల్లి లో మెజార్టీ కేడర్ ఆయనకు దూరమవుతోంది. అక్కడ రాజకీయ ప్రత్యర్థులు ఏకమవుతున్నారు. పార్టీ శ్రేణులు కూడా మంత్రిపై అసంతృప్తితో ఉన్నారు. నిఘా వర్గాలు కూడాహెచ్చరించడంతో జగన్ కాస్తా గట్టిగానే మందలించినట్టు తెలుస్తోంది.
మిగతా మంత్రులు పీడిక రాజన్నదొర, ముత్యాలనాయుడు విషయంలో హైకమాండ్ మంచి మార్కులే వేసినట్టు తెలుస్తోంది. తమకు అప్పగించిన శాఖల విషయంలో కాకున్నా.. నియోజకవర్గ శ్రేణులతో మమేకమవుతున్నారని నిఘా వర్గాలు తెలియజేసినట్టు సమాచారం. అందుకే వీరిద్దరికిపాసు మార్కులు వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఉత్తరాంధ్రలోని ఆరుగురు మంత్రుల్లో నలుగురికి గట్టి ఝలక్ తగలనుందన్న టాక్ అయితేమాత్రం వినిపిస్తోంది.