ABN RK: తెలుగుదేశం పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలి..సగటు కార్యకర్త, అభిమాని పడుతున్న తపన ఇది. అలాగే చాలావర్గాలు,వివిధ రంగాల ప్రముఖులు సైతం టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అందులో ముందు వరుసలో ఉండేది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ. మీడియా సంస్థల అధినేతగా రామోజీరావు తరువాత అనతికాలంలో ముద్ర వేసుకున్నారు ఆర్కే. అటు ప్రింట్, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అధినేతగా రాణిస్తున్నారు. ఆయన ప్రతీవారం సమకాలిన రాజకీయాంశలపై వీకెండ్ కామెంట్స్ విశ్లేషణలు, ఓపెన్ హార్ట్ వీత్ ఆర్కే కార్యక్రమాలు తెలుగునాట ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. తొలి సీజన్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం ఆదరణ పొందింది. అయితే తాను ఇంటర్వ్యూ చేయదగ్గ వ్యక్తులు లేరని భావించి కార్యక్రమానికి కొన్నాళ్ల పాటు ఆర్కే రెస్ట్ ఇచ్చారు. అయితే రెండో విడత కార్యక్రమాన్ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళతో ప్రారంభించారు. అయితే అక్కడి నుంచి వారం వారం ఎపిసోడ్లను చూస్తే మాత్రం మనకు ఒకటి అర్ధమవుతుంది. జగన్ వ్యతిరేకులను, బాధితులను ఇంటర్వ్యూకు ఆహ్వానించి తనకు అవసరమైన విషయాన్ని బయటకు లాగుతున్నట్టు అనిపిస్తోంది. జగన్ పై వ్యతిరేకత పెంచేలా కార్యక్రమం రూపొందిస్తున్నట్టు అవగతమవుతోంది.
నాడు పిలవకుండా..
ఆ మధ్యన థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ పృధ్వీని ఆర్కే ఇంటర్వ్యూకు పిలిచారు. అంటే మొదటి సెషన్స్ లో పృధ్వీ చేతి నిండా సినిమాలు ఉన్నప్పుడు కూడా ఆయన గుర్తుకు రాలేదు. అటు తరువాత టీటీడీ భక్తిచానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు సైతం పిలవలేదు. వివాదాస్పద నిర్ణయాలతో పదవి ఊడగొట్టుకున్నారు. కానీ తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. అటువంటి సమయంలో కనీసం ఆయన వెర్షన్ చెప్పించేందుకేనయినా ఆయన్ను పిలవలేదు. ఇటీవల ఆయన వైసీపీకి దూరమయ్యారు. అధిష్టానంతో పాటు అధినేత జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆయన్ను ఏరికోరి మరి తెచ్చి ఆర్కే ఇంటర్వ్యూచేశారు. పృధ్వీతో వైసీపీ విధానాలను చెప్పించారు. అదో తీవ్రవాద సంస్థతో పోల్చుతూ పృధ్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆర్కే తాను అనుకున్న విషయంలో సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. అంతటితో ఆగకుండా ఆర్కే తనకు ఇష్టుడైన చంద్రబాబుపై ప్రశంసలు వచ్చేలా పృధ్వీతో కొన్నిరకాల వ్యాఖ్యానాలు చేయించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి కడతాయని.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయని కూడా చెప్పించారు. ఇదో పద్ధతి ప్రకారం చెప్పించినట్టుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Chandrababu: పాపం చంద్రబాబు పరిస్థితి ఏంటి ఇలా తయారైంది?
పాలన వైఫల్యాలు ఎత్తిచూపేలా..
మరో ఎపిసోడ్ కు రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని పిలిచారు. ఆయన వైసీపీ ప్రభుత్వంలో కీలక కొలువులు దక్కించుకున్నారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ పెద్దల గౌరవ మన్ననలు అందుకున్నారు. కానీ అంతే స్థాయిలో అవమానకర రీతిలో నిష్క్రమించారు. జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో ఉన్నా.. ఎల్వీకి మంచి కొలువులే దక్కాయి. కానీ బీజేపీతో టీడీపీ కటీఫ్ తరువాత ఎన్నికల సమయంలో ఈసీ సీఎస్ గా నియమించడంతో పరిస్థితి మారిపోయింది. వైసీపీకి ఆయన అనుకూలంగా మారిపోయారు. వైసీపీ ఎన్నికల ప్రచారం, తాయిలాల పంపిణీపై ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎస్ గా నియమితులయ్యారు. జగన్ అన్న అని సంబోధించడంతో తెగ మురిసిపోయారు. అటువంటి వ్యక్తి అవమానకర రీతిలో తొలగించబడ్డారు. సహజంగా ఆయనకు సీఎంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై కోపం ఉంటుంది. అటువంటి వ్యక్తిని తెచ్చి ఇంటర్వ్యూ చేసిన ఆర్కే ప్రభుత్వ వ్యతిరేక భావన వచ్చేలా చేయడంలో విజయవంతమయ్యారు. పాలన జరగడం లేదని.. నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని చెప్పించడంలో ఆర్కే సఫలీకృతులయ్యారు.
షర్మిళ ఇంటర్వ్యూతో..
వాస్తవానికి జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు షర్మిళను తెచ్చి రెండో సారి కార్యక్రమాన్ని ప్రారంభించడంతోనే చర్చనీయాంశమైంది. ఏపీలో తనకు బద్ధ శత్రువుగా భావించే ఏబీఎన్ కు ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడంతో వైఎస్ కుటుంబంలో విభేదాలు బయటపడినట్టయ్యింది. వాస్తవానికి అప్పటివరకూ వైఎస్ కుటుంబంలో విభేదాలంటే అదో రాజకీయ స్ట్రేటజీగా చూశారు. కానీ ఆ ఇంటర్వ్యూతో మాత్రం నిజంగా విభేదాలున్నట్టు కన్ఫర్మ్ అయ్యారు. 2014 ఎన్నికల ముందు కూడా ఆర్కే ఇదే విధంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనతో గాడిలో పెట్టగల సామర్థ్యం చంద్రబాబుకే ఉందని తన ఇంటర్వ్యూల్లో ప్రముఖులతో చెప్పించారు. జిల్లాల వారీగా యూత్ ను టార్గెట్ చేస్తూ కార్యక్రమాలను రూపొందించారు. కొన్నివర్గాలను చంద్రబాబుకు చేరువ చేయించగలిగారు. ఇప్పడు కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంతో జగన్ వ్యతిరేకులను, బాధితులను ఒక వేదికపైకి తెస్తున్నారు.
Also Read:YCP- BJP: వైసీపీ వెంటే కేంద్రంలోని బీజేపీ.. ఏపీ బీజేపీ పరిస్థితేంటి?