Chandrababu: తెలుగుదేశం ఆవిర్భావమే ఒక చరిత్ర. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చి దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ వైబ్రేషన్ తెప్పించారు. అప్పటివరకూ దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకునేందుకు కారణమయ్యారు. అటు తరువాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు, రాష్ట్రపతి ఎంపికలో కూడా ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించిన సందర్భాలున్నాయి. అటు తరువాత పార్టీని చేజిక్కించుకున్న చంద్రబాబు సైతం అదే పరంపరను కొనసాగించారు. కూటమిలను కట్టడంలో ప్రధాన భూమిక వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉంటూనే.. కేంద్ర ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం తన ముద్ర చాటారు. కానీ కాలంతో పాటు రాజకీయాలు ఒకేలా ఉండవు. ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అన్న సామెత చందంగా చంద్రబాబు ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పార్టీని నిలబెట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. నాకెందుకు జాతీయస్థాయి రాజకీయాలు అన్నట్టు సొంతింటిని చక్కదిద్దే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఆయన పరిస్థితి ఇంతలా దిగజారుతుందని ఎవరకూ ఊహించలేదు. తాను ఎదురెళ్లి ఆహ్వానిస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదు. కానీ తాను మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా బీజేపీ ప్రాపకం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరచిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. అదీ కూడా బీజేపీ పెద్దలు అడగకుండానే ఎదురెళ్లి మరీ ప్రకటించేశారు. దీనిపై ఇంటా బయట రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
వైసీపీ, టీడీపీ మద్దతు ఒకరికే…
ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అధికార, విపక్షాలుగా ఉన్న వైసీపీ, టీడీపీలు ఎన్డీఏ బలపరచిన అభ్యర్థికే మద్దతు ప్రకటించాయి. ఇన్నాళ్లూ బీజేపీకి మద్దతు విషయంలో పరస్పరం దుమ్మెత్తిపోసుకున్న ఇరు పక్షాలూ ఇప్పుడు ఒకే వేదికపై వచ్చినట్టయ్యింది. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే వీరు మద్దతు ప్రకటించడం విశేషం. అటు తనపై కేసులు ఉన్న ద్రుష్ట్యా కేంద్ర పెద్దల జోక్యం అవసరం.
Also Read: YCP- BJP: వైసీపీ వెంటే కేంద్రంలోని బీజేపీ.. ఏపీ బీజేపీ పరిస్థితేంటి?
అందుకే జగన్ వారి వద్ద అణిగిమనిగి ఉంటున్నారు. తన మద్దతు ఎప్పుడూ బీజేపీకేనన్న రేంజ్ లో ఉంటున్నారు. అటు వైసీపీ సంఖ్యాబలం, జగన్ నమ్మకస్థుడని భావించడంతో బీజేపీ పెద్దలు కూడా ఆయననే మచ్చిక చేసుకుంటున్నారు. జగన్ తో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు బలం తక్కువ. పైగా గత అనుభవాల ద్రుష్ట్యా అతడ్ని దూరం పెట్టడమే మంచిదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీని దూరం చేసుకున్నందున తగిన మూల్యం చెల్లించుకున్నానని చంద్రబాబు తెగ బాధపడుతున్నారు. అందుకే బీజేపీ విషయంలో ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని సూచిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. ప్రాంతీయ పార్టీలు సైతం సైద్దాంతిక విభేదాలతో సతమతమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఎదురెళ్లే పరిస్థితి లేదు. ఎందుకొచ్చింది గొడవ అంటూ చంద్రబాబు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సామాజిక కోణం చూస్తుందన్న పాత పల్లవిని బయటకు తీశారు. ఎమ్మెల్యేలతో సమావేశమై మన మద్దతు ముర్ముకేనని ప్రకటించేశారు.
మద్దతు కోరకుండానే..
ద్రౌపది ముర్ము గిరిజన తెగకు చెందడం.. తొలి గిరిజన మహిళా అభ్యర్థి కావడంతో తమ మద్దతు ఆమెకే ప్రకటిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. అయితే ఆయనకు బీజేపీ పెద్దలెవరూ సంప్రదించలేదని తెలుస్తోంది. వారు అడగకుండానే మద్దతు తెలపడంతో చంద్రబాబు పరిస్థితిని చూసి జాతీయస్థాయి నాయకులు జాలిపడుతున్నారు. చంద్రబాబుకు ఈ పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీతో పోల్చుకుంటే టీడీపీ సంఖ్యాబలం చాలా తక్కువ. వైసీపీకి ఆరు శాతం ఉంటే.. టీడీపీకి అరశాతం కూడా లేని పరిస్థితి. అందుకే చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు ఎటువంటి అవకాశం లేదు. అలాగని విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా గెలిచే పరిస్థితి లేదు. కనీసం గెలుపు అంచుల దాకా వచ్చే పరిస్థితి ఉన్నా చంద్రబాబు వేరే ఆలోచన చేసేవారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబుకు కీలకం. అందుకే ఆయన బీజేపీ ప్రాపకం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో బీజేపీకి ఎదురెళ్లడమంటే చేతులు కాల్చుకోవడమన్నది అని ఆయనకు తెలుసు. అందుకే ఆచీతూచీ వ్యవహరించి చివరకు ఎన్డీఏ బలపరచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించేశారు.
Also Read:China Companies Tax Evasion in India: భారత్ సొమ్ము కాజేస్తున్న చైనా.. ఎలానో తెలుసా?