YCP: జగన్ టీం ఆ విషయాన్ని మరుస్తోంది

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందిస్తోంది. అంతవరకూ ఓకే కానీ.. పదేపదే తాము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పాట పాడడం మాత్రం వికటించే అవకాశం ఉంది.

Written By: Dharma, Updated On : November 28, 2023 12:43 pm

YCP

Follow us on

YCP: ఎదుటి వ్యక్తి దానం చేస్తే తీసుకునే స్థితిలో ప్రజలు లేరు. దానం అంటే ఒకరి దయ అన్న స్థితికి పరిస్థితి మారిపోయింది. చివరికి అన్నదానం సైతం అదే కోవలోకి చేరుతుంది. ఒకరు అన్నదానం చేస్తే తాము తినే స్థితిలో ఉన్నామా? అన్న ప్రశ్నకు వస్తున్నారు. అందుకే ఈ మధ్యన అన్నదానం అనకుండా.. అన్న ప్రసాద వితరణ అనే మార్పు చేసేటంతటి పరిస్థితి వచ్చింది. అయితే వైసీపీ ప్రజా ప్రతినిధులు ఈ నిజాన్ని తెలుసుకోవడం లేదు. సంక్షేమ పథకాలు మంజూరు చేయడానికి.. దానం రేంజ్ లో ప్రచారం చేసుకోవడం విశేషం.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందిస్తోంది. అంతవరకూ ఓకే కానీ.. పదేపదే తాము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పాట పాడడం మాత్రం వికటించే అవకాశం ఉంది. ఇది ముమ్మాటికి చేటు తెస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాము సంక్షేమ పథకాలకు అర్హులం కాబట్టి.. ప్రభుత్వానికి పనులు కడుతున్నాం కాబట్టి తమకు అందిస్తున్నారు తప్ప.
. ఇంకొకరి దయ మాకెందుకు అన్న రీతిలో ప్రజలు ఉన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం.. ఇది గుర్తించకుండా ప్రజల మధ్యకు వెళ్లి తమ ప్రభుత్వ దానగుణంగా చెబుతున్నారు.

మొన్న ఆ మధ్య గడపగడపకు మన ప్రభుత్వం అంటూ.. వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రతి గడపకు వెళ్లారు. ఇదిగో ఈ సంక్షేమ పథకాలు మీకు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. సంతృప్తి చెందిన వారు ఓకే అన్నారు. కానీ అభివృద్ధి పనులు లేవని ప్రశ్నించిన వారు ఉన్నారు. నిలదీసినంత పని చేసిన వారు ఉన్నారు. ఊరకే ఇస్తున్నారా? మేము కట్టిన పన్నులే కదా అని తేల్చి చెప్పిన వారు ఉన్నారు. మరికొందరైతే మీ ఇంట్లోది ఇస్తున్నారా? అంటూ కలబడేందుకు కూడా సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని పదేపదే చెప్పడంతో ప్రజల్లో ఒక రకమైన భావన వస్తోంది. అది వైసీపీ నాయకత్వం గుర్తించడం లేదు.

ఇప్పుడు వై ఎ పి నీడ్స్ జగన్ అంటూ యంత్రాంగాన్ని ప్రజల్లోకి దింపుతున్నారు. సంక్షేమ పథకాలు సరే. మరి అభివృద్ధి మాట ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి వారికి సమాధానం దొరకడం లేదు. ఎన్నికలకు ఉన్నది మూడు నెలలే. చేసిన పని చెప్పుకోడానికి లేదు.. చేస్తామన్న పని పూర్తిచేసే వీలు లేదు. దీంతో రెండింటికి చెడ్డ రేవడిలా మారింది. దీంతో సంక్షేమ పథకాలు ఆపేస్తే అభివృద్ధి ఇట్టే జరిగిపోతుందని వైసీపీ ప్రజా ప్రతినిధులు కొత్త భాష్యం అందుకుంటున్నారు. సంక్షేమ పథకాల మాటున దానం చేస్తున్నామన్న కామెంట్స్ ఒకవైపు.. పథకాలు నిలిపివేస్తేనే మీ అభివృద్ధి జరుగుతుందన్న వ్యాఖ్యలు మరోవైపు.. జగన్ సర్కార్ కు తల నొప్పులు తెచ్చి పెడుతున్నాయి.