Jagan
Jagan: అభ్యర్థుల ఎంపికలో జగన్ వ్యూహం ఎవరిని అంతుపట్టడం లేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న నేతలను సైతం వదులుకునేందుకు జగన్ సిద్ధపడుతుండడం సొంత పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు. కొందరు నేతలను జగన్ పక్కన పెడుతుండగా.. అధినేత వైఖరి నచ్చక మరి కొంతమంది పార్టీకి దూరం జరుగుతున్నారు. అయితే వీరంతా జగన్ కు వీర విధేయత ప్రదర్శించిన వారే కావడం గమనార్హం. అయితే పార్టీ నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడు వెళుతున్న జగన్ లెక్క చేయడం లేదు. వారి స్థానంలో కొత్తవారిని వెతికి తెచ్చి మరీ పెడుతున్నారు. తాజాగా నెల్లూరు పార్లమెంటు స్థానానికి శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈయన విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు. ఇక్కడ అభ్యర్థిగా ఉన్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరం కానుండడంతో.. ఆయన స్థానంలో ఆర్థికంగా బలంగా ఉన్న అరబిందో సంస్థకు చెందిన శరత్ చంద్రారెడ్డిని జగన్ ఎంపిక చేయడం విశేషం.
శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సిబిఐ, ఈడి తెలిపాయి. లిక్కర్ కేసులో ఈయన అరెస్టు అయ్యారు కూడా. అప్రూవర్ గా మారడంతో బెయిల్ పై విడుదలయ్యారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డిని నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ భావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నా.. సరైన అభ్యర్థిగా జగన్ భావించడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని వైసీపీ హై కమాండ్ ప్రకటించింది. కానీ నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం అభ్యర్థి విషయంలో వేంరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ స్థానానికి పంపించారు. అయితే నెల్లూరు సిటీ స్థానం నుంచి డిప్యూటీ మేయర్ అయిన ఖలీల్ ను ఎంపిక చేశారు. ఈయన అనిల్ కుమార్ అనుచరుడు. ఈ నియామకం విషయంలో జగన్ వేంరెడ్డిని కనీస స్థాయిలో కూడా సంప్రదించలేదు. ఆ స్థానం నుంచి తన భార్యను పోటీ చేయించాలని వేంరెడ్డి చూశారు. కానీ జగన్ ఖలీల్ కు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి అనిల్ కుమార్ యాదవ్ మనస్థాపంతో ఉన్నారు. అందుకే టిడిపిలో చేరితే ఎంపీ టికెట్ తో పాటు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో అటువైపు మొగ్గు చూపారు. దీంతో నెల్లూరు లోక్ సభ స్థానానికి శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీలో సౌమ్యుడిగా, ఆజాతశత్రువుగా వేంరెడ్డి గుర్తింపు పొందారు. అటువంటి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరమవుతుండడంతో వైసిపి వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వేంరెడ్డి విషయంలో జగన్ అనుసరించిన తీరుపై సొంత పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. కేవలం అనిల్ కుమార్ యాదవ్ నోటి దురుసు కారణంగా.. వేంరెడ్డిని వదులుకోవాల్సి రావడం వైసీపీకి లోటుగా తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ స్కాం ఆరోపణలు ఉన్న.. స్థానికేతరుడు అయిన శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేయడం కూడా వైసిపి వర్గాలు తప్పు పడుతున్నాయి.