Chandrababu Arrest: చంద్రబాబు కుటుంబం పై జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. రాజకీయంగా దెబ్బ కొట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలపై సైతం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి . వారిని సైతం అవినీతి కేసుల్లో నిందితులుగా చూపడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. తనను అవినీతిపరుడుగా ముద్ర వేసి.. 16 నెలల పాటు జైలు పాలు చేసిన వ్యక్తుల్లో చంద్రబాబు కీలకమని జగన్ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు నిద్ర పట్టనీయకూడదని డిసైడ్ అయినట్టున్నారు. ఇది రాజకీయంగా లాభమా? నష్టమా? అనేది వేరే సంగతిగా భావిస్తున్నట్లు సమాచారం. మూడు వారాలుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. లోకేష్ అరెస్ట్ తప్పదని భావిస్తున్నారు.
అటు తనపై తప్పుడు రాతలతో.. ఏ 1 నిందితుడిగా చూపిన రామోజీరావు పై సైతం జగన్ సిఐడి కేసులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో రామోజీరావు మంచం పట్టినట్లు వార్తలు వచ్చాయి. అంతలా ఆయనపై మార్గదర్శి బూచిని చూపించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబును టచ్ చేసి ఎల్లో మీడియాను సైతం షేక్ చేస్తున్నారు. అటు ఎల్లో మీడియా సైతం భూ ప్రపంచం బద్దలైందన రీతిలో కథనాలను ప్రచురిస్తోంది. అయితే అంతకుమించి నందమూరి, నారా కుటుంబాలకు షాక్ ఇవ్వడానికి సీఎం జగన్ సిద్ధపడుతున్నట్లు సమాచారం.
నారా భువనేశ్వరి, బ్రాహ్మణులపై కూడా త్వరలో కేసులు నమోదయ్యేందుకు సిఐడి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ ను 14వ నిందితుడిగా సిఐడి చేర్చింది. అక్టోబర్ 4 న విచారణకు హాజరుకావాలని నోటీస్ జారీ చేసింది. లోకేష్ ను విచారించిన అనంతరం భువనేశ్వరి, బ్రాహ్మణి లపై దృష్టి పెడతారని తెలుస్తోంది. ఈ కేసులో ప్రధానంగా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను చేర్చడం వెనుక కూడా వ్యూహం అదేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంస్థలో బ్రాహ్మణి, భువనేశ్వరి కీలక హోదాల్లో ఉన్నారు. లోకేష్ కేవలం డైరెక్టర్ మాత్రమే. కానీ వారిద్దరు మాత్రం మేనేజ్మెంట్ హోదాల్లో కొనసాగుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో హెరిటేజ్ సంస్థ భారీగా లబ్ధి పొందినట్లు సిఐడి గుర్తించింది. భువనేశ్వరి, బ్రాహ్మణిలను అవినీతిలో భాగస్వామ్యం చేసేందుకే సిఐడి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు కుటుంబమంతా అవినీతిమయంగా మారిందని చూపించేందుకు నారా లోకేష్ తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి.. ఇలా కుటుంబమంతా అవినీతికి పాల్పడిందని ప్రజలు గుర్తించేలా కేసుల పరంపర కొనసాగించాలని జగన్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు జైల్లో ఉన్నారు. త్వరలో లోకేష్ ను పంపించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మిగిలింది భువనేశ్వరి, బ్రాహ్మణి లే. అయితే మహిళలను జైలుకు పంపేంత అవివేకంగా జగన్ వ్యవహరిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.