Jagan Govt: జగన్ ఏది చేసినా అందులో విషయం, పరమార్థం దాగి ఉంటుంది. ఆయనేదీ ఊరకనే చేయరు. ఒకటికి రెండుసార్లు ఆలోచించే చేస్తారు. ఆయనకు వ్యక్తిగతంగా ప్రయోజనముంటేనే ఆలోచిస్తారు. రాజకీయ లబ్ధి వస్తుందంటే చాలూ ఎంతకైనా తెగిస్తారు. తెగువ ప్రదర్శిస్తారు. ఆయన విపక్షంలో ఉన్నా..అధికారపీఠానికి ఎక్కినా అదే స్ట్రాటజీతోనే ముందుకు సాగుతారు. అయితే ఇటీవల ఆయన ఏది చేసినా రివర్స్ అవుతోంది. గతంలో చేసిన తప్పిదాలు సైతం తెరపైకి వస్తున్నాయి. అటు తీసుకున్న నిర్ణయాలు ఎదురుతిరుగుతున్నాయి. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. డబ్బులు పంచుతున్నాం కదా.. ఎలాగోలా సర్దుకుంటుంది కదా అని భావించిన ఆయనకు సర్వే నివేదికలు, నిఘా వర్గాల అభిప్రాయాలు నివ్వెరపరుస్తున్నాయి. ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వాన్నిరద్దుచేసి ఏకంగా ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవానికి ఏపీ సీఎం జగన్ ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నారు. అధికారంలోకి వస్తూ గత ప్రభుత్వ నిర్ణయాలను పునసమీక్షించడం ప్రారంభించారు. అందులో తప్పులు గుర్తించి సరిదిద్దితే సరిపోయేది. కానీ తప్పులు, ఒప్పులతో పనిలేకుండా అన్నింటినీ రద్దుచేయడం ప్రారంభించారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన పాలన.. కొద్దిరోజులకే అమరావతి రాజధానిపై కూడా తన కర్కశాన్ని చూపించడం మొదలు పెట్టారు. చంద్రబాబు ఎంపిక చేసిన రాజధాని నుంచి తాను ఎందుకు పాలన సాగించాలనుకున్నారో? ఏమో? కానీ ముచ్చటగా మూడు రాజధానులు ప్రకటించారు. సాధ్యం కాదని తెలిసినా సాహసం చేశారు. ఒక్క అడుగు ముందుకెయ్యలేక… అటుఅమరావతిని అభివృద్ధి చేయక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని దేశ పఠంలో నిలబెట్టిన అపవాదును మూటగట్టుకున్నారు. అటు మూడు రాజధానులకు మద్దతుగా ప్రజాభిమానాన్ని పొందలేకపోయారు. దీంతో కక్కలేక..మింగలేక ఇబ్బందిపడుతున్నారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రతికూల తీర్పు వస్తుందన్న బెంగ ఇప్పుడు జగన్ కు వెంటాడుతోంది.
అదే కానీ జరిగితే జగన్ రాజకీయ సమాధిని ముందుగానే నిర్మించుకున్నట్టవుతోంది. అటు మూడు రాజధానులు టెక్నికల్ గా సాధ్యం కాదని నిపుణులు హెచ్చరించినా పెడచెవిన పెట్టిన జగన్ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా మూడు రాజధానుల మద్దతును కూడగట్టాలని భావిస్తున్నా.. అది వర్కవుట్ కావడం లేదు. అందుకే ఇప్పుడు రాజీనామా అస్త్రాలను బయటకు తీయడానికి నిర్ణయించారు. ఉత్తరాంధ్ర మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించయడానికి ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా గవర్నమెంట్ ను డిజాల్వ్ చేసి.. మూడు రాజధానులను అడ్డుకున్నది విపక్షాలే అని ఆరోపిస్తూ ప్రజల మద్దతు, సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబరులో ప్రభుత్వాన్ని తనకు తాను కూల్చి..విపక్షంపై నెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం.

జగన్ ముందస్తుకు ఒక్క రాజధాని అంశమే కారణం కాదు. పైకి మాత్రం మూడు రాజధానుల అజెండా. కానీ లోపల ఎన్నో కారణాలున్నాయి. ప్రధానంగా ప్రజా వ్యతిరేకత పెల్లుబికుతోంది. అటు తనపై ఉన్న సీబీఐ కేసులు ఫైనల్ హీయరింగ్ కు వస్తున్నాయి. అటు బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకేసు మెడకు చుట్టుకుంటోంది. అంతకు మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. అటు కేంద్ర ప్రభుత్వం సైతం సహాయ నిరాకరణ ప్రారంభించింది. అప్పులకు పరిమితి, నిబంధనలను విధిస్తోంది. ఇటుచేస్తే రాష్ట్రంలో విపక్షాలు బలం పెంచుకుంటున్నారు. ప్రభుత్వంతో పాటు తన గ్రాఫ్ తగ్గుతుందని జగన్ భావిస్తున్నారు. వీటన్నింటినీ అధిగమించాలంటే ముందస్తు ఎన్నికలకు తప్ప మరే ఇతర ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. సో అందుకే డిసెంబరులో గవర్నమెంట్ ను డిజల్వ్ చేసి ఎన్నికలకు వెళ్లడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న మాట.