JD Lakshmi Narayana: గత ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఎన్నికలకు పక్షం రోజుల ముందు తెరపైకి వచ్చిన ఆయన విశాఖలో గట్టి ప్రభావమే చూపారు. గణనీయమైన ఓట్లు సంపాదించుకున్నారు. ఒకానొక దశలో ఆయన గెలుపొందుతారని కూడా సర్వే నివేదికలు వచ్చాయి. 3.50 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నా.. త్రిముఖ పోరులో ఆయనకు ఓటమి తప్పలేదు. అయితే అటు తరువాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. జనసేన నుంచి బయటకు వెళుతునే పవన్ తిరిగి సినిమాలు చేస్తున్నందునే పార్టీకి దూరమవుతున్నానని రీజన్ చెప్పి బయటకు వెళ్లిపోయారు. కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి సామాజిక అంశాలపై ప్రచారం చేసుకుంటూ మూడున్నరేళ్లు గడిపేశారు. అయితే ఆయనకు ఎన్నికలు, రాజకీయాలంటే ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బరిలో దిగాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఏ పార్టీ అంటే ఇండిపెంటెంట్ గా పోటీచేస్తానని చెబుతున్నారు.

అయితే ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగి విజయం సాధించడం అసాధ్యమన్న విషయం వీవీ లక్ష్మీనారాయణకు తెలియంది కాదు. ఏదో పార్టీ అండలేనిదే సాధ్యమయ్యే పనేకాదు. అయితే ఇప్పుడున్న సిట్యువేషన్ లో ఆయన టీడీపీలో చేరే పరిస్థితి లేదు. బీజేపీలోకి వెళ్ళరు. వెళ్లినా గెలవలేను అన్న విషయం ఆయనకు తెలిసిందే.అయితే ఆయన ముందున్న అల్ట్రనేషన్ పార్టీ జనసేనయే. అయితే ఆయనకు ఆత్మాభిమానం అడ్డువస్తోంది. పవన్ సినిమాల వైపు తిరిగి వెళ్లడం వల్లే తాను పార్టీని వీడుతున్నానని నాడు ప్రకటించారు. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తాను తిరిగి పార్టీలో ఎలా చేరుతానని మొహమాటం పడుతున్నారుట. అయితే జనసేన నుంచి, ముఖ్యంగా పవన్ నుంచి నేరుగా ఆహ్వానం అందితే మాత్రం ఆయన తిరిగి చేరిపోయే చాన్స్ ఉందన్న టాక్ నడుస్తోంది. అయితే దీనిపై జనసేన వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేడీ లక్ష్మీనారాయణ తనంతట తాను పార్టీకి దూరమయ్యారని.. అటువంటి వ్యక్తిని తిరిగి ఎలా పిలుస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఆది నుంచి పవన్ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు రాజకీయాల్లో ఉండాలని బలంగా కోరుకుంటూ వస్తున్నారు. అందుకే గత ఎన్నికలకు 15 రోజుల ముందునే ఆయన్ను పార్టీలోకి రప్పించి కీలకమైన విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీచేయించారు. కానీ దురదృష్టవశాత్తూ ఓడిపోయారు. పార్టీకి దూరమయ్యారు. వాస్తవానికి జనసేన సిద్ధాంతాలు, పవన్ భావజాలం జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారికి దగ్గరగా ఉంటాయి. అయితే మరోసారి విశాఖ నుంచిబరిలో దిగాలని ప్రయత్నిస్తున్న జేడీకి ఉన్న ఏకైక మార్గం జనసేనయే. అందుకే ఆయన ఎటువంటి బెట్టు చేయకుండా తన మనసులో ఉన్న మాటను జనసేనాని ముందు బయటపెట్టాలి. అయితే జేడీని జనసేనలోకి తిరిగి తీసుకునే చాన్స్ అధికంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జేడీ లాంటి వారు తిరిగి యాక్టివ్ అయితే జనసేనకు ఒక ఊపు వస్తుందని భావిస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే త్వరలో జేడీ జనసేనలోకి పునరాగమనం ఖాయమని నమ్మకంగా చెబుతున్నారు.