
Jagan YCP MLAs : ఆ అధినేత ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ విధించారు. గడువులోగా తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే ఉన్న స్థానం నుంచి తప్పిస్తానంటూ హెచ్చరించారు. అధికారమే పరమావధిగా కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. కానీ ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టారు. కొందరు ధిక్కార స్వరాన్ని వినిపించారు. మరికొందరు ఫిరాయింపులతో అధినేతకు ఝలక్ ఇచ్చారు.
ఏపీ సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన గడువు పూర్తయింది. ఎమ్మెల్యేల పనితీరు పై రిపోర్టులు రెడీ అయ్యాయి. గడపగడపకు ప్రభుత్వం పై ప్రొగ్రెస్ కార్డ్ సిద్ధమైంది. అధినేత ఇచ్చిన టాస్క్ ఎంత మంది విజయవంతంగా పూర్తీ చేశారో తెలిసిపోయే రోజు రానే వచ్చింది. ఈనెల 13న ఎమ్మెల్యేలతో భేటీకి అధినత జగన్ తేదీని ఖరారు చేశారు. ఆ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు పై నివేదిక విడుదల కానుంది. ఎవరికి టికెట్లు ఇస్తారో.. ఎవరిని ఇంటికి సాగనంపుతారో తేలిపోతుంది. ఇప్పటికే ఐప్యాక్ సంస్థ సర్వే రిపోర్టులను జగన్ వద్దకు చేర్చింది. ఇక జగన్ రిపోర్టులు వెల్లడించడమే తరువాయి.
ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరు నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈనెల 13న జరగబోయే సమావేశం చాలా కీలకం కానుంది. ఇప్పటికే గృహసారథుల నియామకం పై దిశానిర్దేశం చేశారు. ఈనెల 13న ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ తో పాటు కొత్త కార్యక్రమాల నిర్వహణ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం పై ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో వంద శాతం పూర్తీ చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల సమీక్షలు జరిగాయి. అభ్యర్థులు ఎవరనే అంశం పై క్లారిటీ ఇచ్చారు. సమస్యలున్న చోట పరిష్కార మార్గాలను సూచించారు.
2024 ఎన్నికలకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్లు కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను తప్పించి.. కొత్తవారిని రంగంలోకి దింపే సూచన కనిపిస్తోంది. ఐప్యాక్ సర్వే సంస్థ నుంచి అందిన రిపోర్టుల ప్రకారం జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేలను, ప్రజావ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు జగన్ టార్గెట్ సొంత పార్టీ ఎమ్మెల్యేలని చెప్పవచ్చు. ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ రావాలంటే జగన్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే.