PK Rosy : స్వాతంత్య్రానికి ముందు కథ ఇదీ.. సమాజంలో అసృశ్యత, అసమానతలు, కుల, జాతి వివక్ష పెచ్చరిల్లుతున్న రోజులు అవీ. మహిళలు వంటింటి కుందేళ్లుగా మగ్గిపోతున్న దినాలవీ.. ఆడపిల్లలు అడుగు తీసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు.. ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు.. ఆంక్షలు.. అంతటి నిర్బందాల నడుమ ఓ యువతి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటి మలయాళీ నటిగా చరిత్రకెక్కింది. ఆమె ఎవరో కాదు ‘పీకే రోజీ’.. దేశంలోనే మొట్టమొదటి హీరోయిన్ అయిన ఈమెకు అందుకే గూగుల్ గుర్తుంచుకొని మరీ నివాళులర్పించింది. మన చిత్ర పరిశ్రమ మరిచిన ఈమె గురించి గొప్పగా చాటింది.
1903 ఫిబ్రవరి 10న పీకేరోజీ పుట్టినరోజు. అందుకే ఈరోజు గూగుల్ ఆమెకు ఘనంగా నివాళులర్పించింది. ఏకంగా గూగుల్ డూడుల్ పెట్టి మరీ దేశ ప్రజానీకానికి ఆమె ఘనతను చాటి చెప్పింది. ప్రపంచానికి మన మొట్టమొదటి హీరోయిన్ ఈమె అని తెలిసేలా చేసింది. చాలా మందికి గూగుల్ పెట్టాకే ఈమె ఎవరు అన్న ఆసక్తి కలిగింది. అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
-ఎవరీ రోజీ..?
కేరళలోని నందనకోడ్ త్రివేండ్రంలో పులయ కుటుంబంలోని పౌలోస్ మరియు కుంజి దంపతులకు రోజీ 1903 ఫిబ్రవరి 10న జన్మించింది. ఈమె అసలు పేరు రాజమ్మ. పేదరికంలో ఉన్న వీరి కుటుంబం అష్టకష్టాలు పడుతుండేది. దానికితోడు రోజీ తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. రోజీ చిన్నతనంలోనే పొలం పనులకు వెళుతూ గడ్డికోసేది. కానీ తనకు కళల పట్ల ఆసక్తి ఉండేది. దాంతో రోజీ మామయ్య ఆమెను ప్రోత్సహించాడు. సంగీతం, నటనలో ఓ గురువు వద్ద శిక్షణ ఇప్పించారు. ఆమె సాంప్రదాయక కళలు నేర్చుకుంది. కక్కరిస్సి నాటకం యొక్క జానపద కళారూపాన్ని బాగా అభినయించేంది.. ఇది తమిళనాడు నుండి ఉద్భవించిన కళారూపం. సంగీత నాటక ఆకృతిలో మలయాళం మరియు తమిళ మిశ్రమాన్ని కలిగిఉంటుంది. అలా నటనలో ఓనమాలు దిద్దిన రోజీ సినీ రంగంలోకి ప్రవేశించింది..
-సినీ రంగంలోకి ప్రవేశం..
అలా సినీ రంగంలోకి రోజీ పరిచయాల ద్వారా ప్రవేశించింది. జేసీ డేనియల్ దర్శకత్వం వహించిన ‘విగతకుమారన్’ (ది లాస్ట్ చైల్డ్)లో నటించింది. మలయాళ చిత్ర సీమలోకి ప్రవేశించిన మొదటి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అగ్రకులానికి చెందిన మహిళగా ఆమె పాత్ర పోషించింది. అయితే ఆ రోజుల్లో నటన అనేది సాధారణంగా స్త్రీల పని కాదు. నటనును తీవ్రమైన వృత్తిగా భావించే కుటుంబాలు ఉండేవి. రోజీకి నటన పట్ల ఉన్న ప్రేమ సమాజం వ్యతిరేకించింది. సమాజం ఆమెను వ్యతిరేకించినా.. అవమానించినా అన్నింటిని అధిగమించి నటిగా నిరూపించుకునేలా చేసింది. అయితే సినిమా విడుదలయ్యాక అందులోని సీన్లను నాయక్ సంఘం వ్యతిరేకించింది. రోజీని సినీ పరిశ్రమలోని చాలామంది ప్రముఖులు నిరాకరించారు. నాయర్ గా నటించిన కారణంగా ఆమె ఇంటిని అగ్రవర్ణాల వారు తగులబెట్టారు. దీంతో కేరళ నుంచి రోజీ ఒక లారీలో పారిపోవాల్సి వచ్చిందని చెబుతారు. ఆమె కేశవ పిళ్లై అనే ట్రక్ డ్రైవర్‌ని వివాహం చేసుకుని తమిళనాడుకు వెళ్లిపోయిందని, అక్కడ ఆమెకు ‘రాజమ్మాళ్’ అని పేరు పెట్టుకుని జీవించారని చెబుతారు.
-భారతదేశంలోనే మొదటి దళిత నటి
ఆమె మలయాళ సినిమాల్లో మొదటి నటి మాత్రమే కాదు, భారతదేశంలోని మొదటి దళిత నటులలో ఒకరు. అయినప్పటికీ సమాజం దానిని స్వాగతించడానికి సిద్ధంగా లేని సమయంలో ఆమె ఎన్నో కలలతో సినీ పరిశ్రమలోని ప్రవేశించింది. కానీ అగ్రవర్ణాల దాటికి ఆమె కల చెదిరి పారిపోవాల్సి వచ్చింది. చాలా కాలం పాటు పీకే రోజీ అజ్ఞాతంలోనే బతికింది. అయితే రాష్ట్రంలోనూ, దేశంలోనూ దళిత రాజకీయాలు జోరందుకోవడంతో ఆమె పేరు మరోసారి మారుమోగింది. దళిత ఉద్యమానికి ఐకాన్‌గా మారి, మళయాళీ ప్రజాజీవితంలో దళితులను వ్యవస్థాగతంగా బహిష్కరించినందుకు ఉదాహరణగా రోజీ ఈరోజు ట్రయల్ బ్లేజర్‌గా గుర్తుండిపోతారు.
ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యుసిసి ) పీకే రోసీ పేరుతో ఫిల్మ్ సొసైటీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. గత శతాబ్దంలో సమాజం సాధించిన పురోగతికి తొలి మహిళగా రోజీ గుర్తింపు పొందింది. సమాజం బహిష్కరించబడిన ఒక మహిళ ఘనతను ఇప్పుడు గూగుల్ మరోసారి అందరికీ తెలియజెప్పింది. ఆమె ఘనతను ఘనంగా చాటింది.