Chandrababu Jail: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఇరికించారా? ఇందులో జగన్ సన్నిహిత ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారా? పక్కా స్కెచ్ గీసింది వారేనా? కర్త,కర్మ,క్రియ పాత్ర పోషించి బాబును జైల్లో పెట్టించగలిగారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా సీఎం జగన్ సన్నిహితులైన ప్రేమ్ చంద్రారెడ్డి, అజయ్ కల్లాం వంటి ఐఏఎస్ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అంతటా ఇదే చర్చ నడుస్తోంది. ఈ కేసులో చంద్రబాబు ఏ 37 కాగా చూపారు. కానీ మధ్యలో 36 మంది నిందితులను ప్రేక్షక పాత్రకు పరిమితం చేశారు. చంద్రబాబును అసలు నిందితుడిగా చూపే ప్రయత్నం చేశారు.
ఇప్పటికే ఈ కేసునకు సంబంధించి టిడిపి ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖలో కీలక అధికారి అయిన పివి రమేష్ స్పష్టతనిచ్చారు.ఇందులో అధికారులను తప్పించి.. సీఎంను బాధ్యులు చేయడం సహేతుకం కాదని చెప్పుకొచ్చారు. తన వాంగ్మూలం ఆధారంగానే చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని సిఐడి తనకు అనుకూలంగా మార్చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసునకు సంబంధించి ముగ్గురు అధికారులను దాటిన తర్వాతే.. చంద్రబాబు వద్దకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగం జరిగితే… కార్పొరేషన్ కార్యదర్శిని, మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్, బాధ్యులైన ఇతర అధికారులను బాధ్యులుగా చేసి విచారించాల్సి ఉంటుందని పివి రమేష్ స్పష్టం చేశారు.
ఈ తరుణంలో ఈ కేసు విషయంలో అందరి పేర్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి ప్రేమ్ చంద్రారెడ్డి వైపే అందరి వేళ్ళు చూపిస్తున్నాయి. ఈయన 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా పనిచేశారు. చెల్లింపులు కూడా ఈయన చేతుల మీదుగానే జరిగాయి. కానీ ఈయన పేరు కేసులో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం ఈయన ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహిత అధికారి. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఎక్కువగా ఈయన సేవలను వినియోగించుకుంటున్నారు. చివరకు తెలంగాణతో విభజనకు సంబంధించి ఎటువంటి చర్చలైన ప్రేమ్ చంద్రారెడ్డి కీలకం. మొన్నటికి మొన్న ఎన్నికల కమిషనర్ ఎంపిక సమయంలో సైతం ఈయన పేరు ప్రధానంగా వినిపించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పారదర్శకంగా కేసు నమోదు చేయాల్సి వస్తే.. ఏ వన్ గా చూపించాల్సింది ప్రేమ్ చంద్రారెడ్డినే.
ఇక మరో ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం గురించి అందరికీ తెలిసిందే. జగన్ కోటరీ ఐఏఎస్ అధికారులు అజయ్ కీలకం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈయన కీలకంగా ఉన్నారు. వాటికి సంబంధించి ఎటువంటి ఫైల్ కదలాలన్నా అజయ్ కల్లాం అప్రూవల్ ఇవ్వాలి. ఈ లెక్కన ఏ 2గా ఈయన పేరు చేర్చాలి. కానీ నిందితుల జాబితాలో ఈయన పేరు లేదు. ఇక మూడో వ్యక్తి పి.వి.రమేష్. అప్పట్లో ఫైనాన్స్ సెక్రటరీగా ఉండేవారు. ప్రస్తుతం ఈ కేసు గురించి ఈయన కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అధికారులేనని తేల్చి చెప్పారు. కానీ పై ముగ్గురు అధికారులను నిందితులుగా చూపలేదు. కానీ ఏ 37 గా ఉన్న చంద్రబాబును మాత్రం ఇరికించగలిగారు. ఇది పక్కా స్కెచ్ తోనే చేసినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుత సీఎం నుంచి చీఫ్ సెక్రటరీ వరకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబును ట్రాప్ చేశామని అనుకుంటున్నారు కానీ.. మున్ముందు కేసులో కీలక మలుపులు తిరుగుతాయని.. కుట్ర దారులంతా కోర్టు బోనులోకి ఎక్కాల్సి ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.