Vijayasai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డిది యాక్టివ్ రోల్. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్ వెంట నడుస్తున్నారు. అంతకంటే ముందు జగన్ తో జైలు జీవితం పంచుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీలో నంబర్ టూగా కొనసాగుతూ వచ్చారు. కానీ ఇటీవల సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిల ప్రాబల్యం అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పెరిగింది. ఇప్పటివరకూ నంబర్ టూగా ఉన్న విజయసాయి క్రమేపీ కిందకు దిగుతూ వస్తున్నారు. అయితే దీనికి ఆయనతో పాటు కుటుంబసభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలే ప్రధాన కారణం. అందుకే జగన్ పక్కన పెడుతున్నారన్న టాక్ నడుస్తోంది. విశాఖ భూ దందాలో అల్లుడు, కుమార్తెలపై ఆరోపణలు రావడం, తాజాగా లిక్కర్ స్కామ్ లో సమీప బంధువు అరెస్ట్ కావడంతో.. కాస్తా వెనక్కి తగ్గు అని సీఎం జగన్ విజయసాయికి ఆదేశించినట్టు సమాచారం.

వైసీపీ అధికారంలోకి రావడానికి విజయసాయి తనవంతు కృషి చేశారు. అటు కేంద్రంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు కూడా పాటుపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డికి అదే స్థాయిలో గుర్తింపు లభించింది. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలు అప్పగించారు. విశాఖ రాజధాని నిర్ణయంతో ముందస్తుగా పరిస్థితులు చక్కబెట్టాలని జగన్ విజయసాయిని పంపించారు. అయితే ఆయన పార్టీ బాధ్యతలు గాలికొదిలేసి తాను వ్యక్తిగతంగా చక్కబెట్టుకున్నారు. అల్లుడు, కుమార్తె పేరిట బినామీ సంస్థలు ఏర్పాటుచేసి భూ దందాకు తెరతీశారు. అయితే దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడం, నిఘా వర్గాలు సైతం సమాచారమివ్వడంతో జగన్ అప్రమత్తమయ్యారు. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. అటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించారు. సజ్జల కుమారుడికి అప్పగించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి విజయసాయిరెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అరబిందో ఫార్మాలో కీలక పొజిషన్ లో విజయసాయిరెడ్డి అల్లుడు, ఆయన సోదరుడు ఉన్నారు. అల్లుడి సోదరుడు తాజాగా అరెస్ట్ అయ్యాడు కూడా. మరోవైపు బీజేపీలోని ఓ వర్గం నాయకులు తాడేపల్లి ప్యాలెస్ కు కూడా లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నట్టు ఆరోపణలు చేశారు. ఓ సమయంలో సీఎం జగన్ భార్య భారతి పేరు సైతం వినిపించింది. అయితే ఈ పరిణామాలన్నింటికీ విజయసాయి కారణమని జగన్ ఆగ్రహంగా ఉన్నారుట. అందుకే కాస్తా పక్కన ఉండాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం.

జగన్ భయపడడానికి మరో రీజన్ ఉంది. ప్రస్తుతం పవన్ జోరు మీద ఉన్నారు. ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎందుకీ గర్జనల పేరిట వైసీపీ నేతల విశాఖ గర్జన ను టార్గెట్ చేస్తూ పవన్ కామెంట్స్ చేసిన తరువాతే విజయసాయి కుటుంబసభ్యుల భూ దందా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడం.. బీజేపీ నుంచి రూట్ మ్యాప్ పవన్ కు రానుందని తెలియడంతో జగన్ జాగ్రత్త పడుతున్నారు. కొద్దిరోజులుగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉండాలని విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చినట్టు సమాచారం. యాక్టివ్ గా ఉండొద్దని కూడా అల్టిమేటం జారీచేసినట్టు తెలుస్తోంది.