Jagananna Videshi Vidya Deevena: చంద్రబాబు ఇచ్చింది గోరంత.. తాము ఇవ్వబోయేది కొండంత.. ఏపీ సీఎం జగన్ స్లోగన్ ఇది. బటన్ నొక్కుడు సంక్షేమ పథకాలకు ఇది వర్తించొచ్చేమో కానీ.. శాశ్వత ప్రయోజనం కలిగించే పథకాల విషయంలో మాత్రం సీఎం చెబుతున్న మాటల్లో నిజం లేదు. అంతా అంకెలు గారడే కనిపిస్తుంది. తాజాగా విడుదల చేసిన విదేశీ విద్యా పథకం కూడా పేద విద్యార్థులకు బురిడీ కొట్టించేలా ఉంది. నిబంధనల పేరుతో లబ్ధిదారులను గణనీయంగా తగ్గించేశారు.
విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలన్నదే విదేశీ విద్యా దీవెన పథకం లక్ష్యం. టిడిపి ప్రభుత్వ హయాంలో సక్రమంగా అమలైన ఈ పథకాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అటకెక్కించింది. ఎన్నికల చివరి ఏడాది కావడంతో పథకాన్ని పునరుద్ధరించింది. కానీ నిబంధనల పుణ్యమా అని లబ్ది పొందే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. టిడిపి హయాంలో 4923 మందికి ఈ పథకము ద్వారా ప్రయోజనం చేకూరింది. కానీ వైసీపీ సర్కార్ గత ఏడాది 213 మందికి మాత్రమే విదేశీ విద్యకు అందించగలిగింది. ఈ ఏడాది మరింత కఠిన ఆంక్షలుతో 144 సంఖ్య కు కుదించింది . ఇందులో ఐదుగురే ఎస్సీ విద్యార్థులు ఉండడం విశేషం.
లబ్ధిదారుల సంఖ్య తగ్గింపునకు జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడలను వేసింది. టిడిపి హయాంలో విదేశాల్లో ఏ యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకున్నా విదేశీ విద్యను అమలు చేశారు. కానీ జగన్ సర్కార్ కొత్త మెలికలు పెట్టింది. యూనివర్సిటీలకు సబ్జెక్టుల వారీగా ర్యాంకింగులు ఇచ్చింది. 50లోపు ర్యాంకు ఉంటేనే ఇస్తామని మెలిక పెట్టింది. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల సంఖ్య కూడా పూర్తిగా పడిపోయింది. గత ఏడాది ఎస్సీ విద్యార్థులు 28 మంది లబ్ధి పొందగా… ఈ ఏడాది మాత్రం కేవలం ఐదుగురే అర్హత సాధించారు. టిడిపి హయాంలో చివరి ఏడాదిలోనే 300 మంది ఎస్సీ విద్యార్థులకు విదేశీ విద్య పథకం ద్వారా నగదు సాయం అందింది. కానీ జగన్ సర్కారు పథకాన్ని పూర్తిగా నీరుగార్చింది. ప్రకటనలకి పరిమితమైంది.కానీ లబ్ధిదారులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.