TTD: టీటీడీ తెరపైకి కొత్త పేరు.. జగన్ కసరత్తు

వైవిని తప్పించి చివరి ఏడాది బీసీ వ్యక్తిని తెరపైకి తెస్తారని అందరూ భావించారు. బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి,పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్థసారధి తదితర పేర్లు వినిపించాయి. జంగా కృష్ణమూర్తి నియామకం దాదాపు ఖరారు అయినట్లు టాక్ వినిపించింది.

Written By: Dharma, Updated On : July 28, 2023 2:32 pm

TTD

Follow us on

TTD: టిటిడి పాలకవర్గ నియామకానికి కసరత్తు జరుగుతోందా? ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని తెరపైకి తెస్తారా? ఆ ప్రయత్నాల్లో సీఎం జగన్ ఉన్నారా? అది సాధ్యమయ్యే పనేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. టీటీడీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. ఆగస్టు 7న చివరి పాలకవర్గ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో కొత్త పాలకమండలి పూర్తి పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈసారి రాజకీయాలకు దూరంగా ఉంటే ఒక ప్రముఖుడిని తెరపై తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని టిటిడి చైర్మన్గా జగన్ నియమించారు. ఆయన సీఎం జగన్కు సమీప బంధువు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో వైవి సేవలను పార్టీకి వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందుకే వైవి సుబ్బారెడ్డిని తప్పించి కొత్త వ్యక్తికి టీటీడీ పీఠం అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారు.

వైవిని తప్పించి చివరి ఏడాది బీసీ వ్యక్తిని తెరపైకి తెస్తారని అందరూ భావించారు. బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి,పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్థసారధి తదితర పేర్లు వినిపించాయి. జంగా కృష్ణమూర్తి నియామకం దాదాపు ఖరారు అయినట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీలో విప్లవాత్మక మార్పులకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా అనుభవానికి ప్రాధాన్యమిచ్చే కోణంలో జగన్ సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సామాజిక సమీకరణలు పక్కకు వెళ్లిపోవడం ఖాయం.

గత కొన్నేళ్లుగా టీటీడీలో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వాన్ని మసకబార్చాయి. ఎప్పటికప్పుడు అన్యమత వివాదాలు చుట్టుముట్టాయి. తొలుత వైవి సుబ్బారెడ్డి నియామకం పైనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీటీడీకి, హిందూ ధర్మానికి మేలు చేసేలా, కోట్లాదిమంది భక్తుల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించే రీతిలో కొత్త పాలకవర్గ నియామకం ఉంటుందని టాక్ నడుస్తోంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.