Jagananna Thodu: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు వేస్తున్న జగన్ చిరు వ్యాపారుల కోసం కూడా తోడు పథకం తీసుకొచ్చారు. చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల దగ్గర మోకరిల్లొద్దనే ఉద్దేశంతో జగనన్న ప్రవేశ పెట్టిన తోడు పథకం వారికి వరం కానుంది. రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది చిరు వ్యాపారులకు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.10 వేలు వేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేడు తాడేపల్లి గూడెం క్యాంపు కార్యాలయంలో మీట నొక్కి పథకం ప్రారంభించనున్నారు.
దీంతో చిరు వ్యాపారులకు కొండంత అండ దొరకనుంది. ఇన్నాళ్లు వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీకి తీసుకొచ్చి వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్న వారిని ఆదుకునే ఉద్దేశంతో జగన్ తీసుకువచ్చిన ఈ పథకంతో మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరనుంది. దీంతో చిరువ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం ప్రభుత్వం ముందుకు రావడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇన్నాళ్లు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Congress- Munugode by-Election: మునుగోడు.. కాంగ్రెస్ ను ముంచుతుందా? తేల్చుతుందా?
రాష్ట్రవ్యాప్తంగా 3.95 లక్షల వ్యాపారులకు రూ.395 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 15.03 లక్షల మందికి రూ.2,011 కోట్ల రుణాలు అందజేసినట్లు చెబుతున్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి 48.47 కోట్ల వడ్డీ అందజేసినట్లు తెలిపింది. దీంతో చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకే తోడు పథకం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. రోడ్ల పక్కన చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ పథకం రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలతోనే పాలన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేస్తూ వారిని బద్దకస్తులను చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్వయం ఉపాధి లాంటి పథకాలు లేకుండా అన్ని ఉచితంగా ఇస్తే ఇక పని చేసే వారుండరనే వాదనలు కూడా వస్తున్నాయి. కానీ జగన్ మాత్రం సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పథకాల అమలుకు శ్రీకారం చుడుతూ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నారు. ఏపీ మరో శ్రీలంక అవడం ఖాయమని ఇప్పటికే చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జగనన్న తోడు పథకం ద్వారా రూ.10 వేలు ఇస్తుంటే అవి ఏ మూలకు సరిపోతాయి. చిరు వ్యాపారమైనా ఈ రోజుల్లో లక్షల్లోనే ఉంటోది. కానీ ప్రభుత్వం ఇచ్చే పదివేలతో ఏ మేరకు లబ్ధి సాధిస్తారో తెలియడం లేదు. సీఎం జగన్ మాత్రం ఈ పథకం దేశానికే ఆదర్శమనే రీతిలో ప్రచారం చేసుకోవడం విశేషం. దీంతో పథకం ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో తెలియడం లేదు. కానీ జగనన్న మాత్రం తోడు పథకం చిరు వ్యాపారులకు నీడనిస్తుందని చెప్పడం కొసమెరుపు.
Also Read:Chandrababu Delhi Tour: చంద్రబాబు వ్యూహం మారిందా? ఢిల్లీ టూర్ ఆసక్తికరం