Jagananna Arogya Suraksha: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ జగన్ సర్కార్ కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడే వారిని గుర్తించి.. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు గాను ” జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ కార్యక్రమం పై ఇంటింటా సర్వే చేపడుతున్నారు. పథకంలో కీలకంగా భావించే వైద్య శిబిరాలను శనివారం ప్రారంభించారు. ఈ శిబిరాలు రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులు పాటు కొనసాగనున్నాయి. మొత్తం ఐదు దశల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సి హెచ్ వో లు, ఇతర సిబ్బందిని భాగస్వామ్యం చేశారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న ఉచిత చికిత్సలు, అనుబంధ ఆసుపత్రుల వివరాలపై ప్రజలకు సమగ్రంగా అవగాహన కల్పించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నెలలో విధిగా ఆ గ్రామంలో ఇంటింటా సర్వే చేపట్టి వైద్య పరీక్షలతో పాటు చికిత్స, ఉచితంగా మందులు అందజేస్తున్నారు. తాజా పథకం ద్వారా అనారోగ్యంతో బాధపడే వారిని గుర్తించి వైద్య శిబిరాలకు తరలిస్తారు. అక్కడ ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 15 వరకు.. 45 రోజులు పాటు ఈ శిబిరాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేయనున్నాయి.
ఇద్దరు ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్యులతో పాటు మరో ఇద్దరు వైద్య నిపుణులు శిబిరంలో సేవలందిస్తారు. రోగులకు బిపి, హెచ్ బి, ఆర్.బి.ఎస్, మూత్ర, డెంగ్యూ, మలేరియా, ఉమ్మి వంటి ఏడు రకాల పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి శిబిరంలో 112 రకాల మందులను అందుబాటులో ఉంచునున్నారు.
వైద్య పరీక్షల్లో దీర్ఘకాలిక రోగులని తేలితే వారిని జిల్లా స్థాయి వైద్య శిబిరానికి పంపుతారు. అక్కడే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అటు నిరంతర పర్యవేక్షణ గాను వైయస్సార్ ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. దాని వినియోగం పై సైతం పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. అటు పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం తయారీపై సలహాలు, సూచనలు అందించనున్నారు.
45 రోజుల పాటు పట్టణాలు, పల్లెలను జల్లెడ పట్టనున్నారు. గ్రామస్థాయిలో ఉండే ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. ఇప్పటికే విద్య విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు వైద్యం పై దృష్టి పెట్టడం విశేషం. ఒకవైపు నాడు- నేడు పథకంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమూల మార్పులు తీసుకురావడం, వసతులు మెరుగుపరచడం వంటి వాటిపై జగన్ సర్కార్ ఫోకస్ చేసింది. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్య సేవలను పల్లెల ముంగిటికే తీసుకొచ్చింది. ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాదిమంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారు. ఇంకా చాలామంది అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. అటువంటి వారికి అవగాహన పెంచడంతో పాటు ఈ కార్యక్రమం ద్వారా భరోసా కల్పించనున్నారు. మొత్తానికైతే 45 రోజులపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామం.