Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో జగన్ అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నేతలే రోడ్లపైకి వస్తూ ఆందోళన చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని అందులో కలపొద్దని కొందరు, మా ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఇంకొందరు పట్టుపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు లొల్లి ప్రధానంగా రేగుతోంది. వేరే పార్టీ వాళ్లు సైలెంట్ గానే ఉన్నా సొంత పార్టీలోనే అసమ్మతి కుంపట్లు రగిలిస్తున్నారు. విధేయులుగా ఉన్న వారే ఎదురు తిరుగుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తుతోంది.
దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఆగ్రహ జ్వాలలు ఆగడం లేదు. ఫలితంగా రాష్ట్రమంతా నిరసన సెగలతోనే అట్టుడుకుతోంది. ఏదో చేయాలని ఏదో అయినట్లు వైసీపీకి ప్రస్తుతం నూతన జిల్లాల ఏర్పాటు సమస్యగా మారింది. దీంతో ఏం చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. జగన్ కు ఇది మరో తలనొప్పిగా తయారయింది. ఎందుకో తేనెతుట్టెను కదిపామని లోపల మథనపడిపోతున్నారు.
సహజంగా ప్రతిపక్ష పార్టీలే ఇలాంటి రగడ రాజేస్తారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా సొంత పార్టీలోనే నేతలు వివాదాలు రగిలిస్తున్నారు. తమ ప్రాంతంపై చిన్న చూపు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లోనే ఈ వివాదాలు వస్తున్నాయి. తాజాగా ఇందులో విశాఖపట్నం కూడా చేరుతోంది. ఇక్కడ కూడా గొడవలే ప్రధానంగా తెర మీదకు వస్తున్నాయి.
Also Read: ఉద్యోగుల సమ్మెను లెక్కచేయని జగన్.. ఇంకా బెదిరింపు ధోరణే..
రాష్ట్రంలో రోజురోజుకు వివాదాలు ఎక్కువవుతున్నాయి. రోడ్లెక్కి మరీ నినాదాలు చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాయకులకు నిద్ర పట్టడం లేదు. ఎందుకో జిల్లాల ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకోవడం తప్పయిందనే వాదనలు కూడా వస్తున్నాయి. అందుకే గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి విన్నపాలు వచ్చినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు.
కానీ జగన్ ఏదో చేయాలని భావించి ఇరుక్కుపోయారు. సొంత పార్టీలోనే వేరు కుంపట్లు రగులుతుండటంతో రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. దీంతో కొరివితో తల గోక్కున్నట్లుగా ఉందని నేతలు భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అసమ్మతిని పెంచి పోషించుకున్నట్లుగా ఉందని లోలోపలే మథనపడుతున్నారు. ఈ వ్యవహారం ఇంకా ఏం సమస్యలు తెస్తుందో అర్థం కావడం లేదు.
Also Read: ఎట్టకేలకు ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఇక పోరాటం చేస్తారా?