Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: పథకాలు.. ప్రజలు.. దేవుడిపైనే ధీమా.. మీడియాను లెక్క చేయని జగన్‌!

CM Jagan: పథకాలు.. ప్రజలు.. దేవుడిపైనే ధీమా.. మీడియాను లెక్క చేయని జగన్‌!

CM Jagan: అనుభం పాఠాలు నేర్పుతుంది. స్వానుభవానికి మించిన గురువు లేడంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి స్వానుభవాలు ఆయన ఆలోచనని విపరీతంగా ప్రభావితం చేశాయంటున్నారు ఆయను దగ్గరి నుంచి పరిశీలించినవారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో కానీ, వ్యవహార శైలిలోగానీ ప్రమాదం అంచుల్లో పయనిస్తున్నట్టుగా ఆయనని గమనిస్తున్న శ్రేయోభిలాషులకి అనిపిస్తున్నా.. ఆయన మాత్రం తన స్వానుభవసారంతో ఏర్పరుచుకున్న అభిప్రాయాలతోటే సాగిపోతున్నారని అంటున్నారు. తన విజయానికి అండగా నిలిచిన మీడియా సంస్థలను ఆయన పెద్దగా లెక్కచేయడం లేదు. ప్రజాదరణే తన విజయానికి కారణమని నమ్ముతున్నారు. సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని అనుకుంటున్నారు. మీడియా ప్రాధాన్యతను, ప్రభావాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

CM Jagan
Y S Jagan

రాజకీయాల్లో మీడియా ప్రధాన భూమిక..

ప్రజాస్వామ్య రాజకీయాల్లో మీడియాది ప్రధాన భూమిక. ఇది ఇప్పటి విషయం కాదు. దశాబ్దాలుగా అందరికీ అనిపిస్తున్న, కనిపిస్తున్న వాస్తవం. తిమ్మిని బమ్మి చెయ్యాలన్నా, లేని దానిని ఉన్నట్టు భ్రమింపజేయాలన్నా రాజకీయ పార్టీలు మీడియాని వాడుకున్నంతగా ఎవరూ వాడుకోరు. ఈ దేశంలో మీడియా సంస్థలుగా గుర్తింపు పొందిన వివిధ ఛానల్స్, పత్రికలు నడుస్తున్నాయంటే అదంతా పార్టీల చలవే. దీనివల్ల ప్రజలకి వాస్తవాల కంటే ఏకపక్ష వార్తలు, అభూత కల్పనలు వినాల్సి వస్తోంది. అయినా ప్రజలు వాటికి అలవాటు పడ్డారు. తమ భావజాలానికి నచ్చిన పత్రిక చదువుతూ.. చానల్‌ చూస్తూ అందులో వచ్చిందే నిజమనుకుంటున్నారు.

మీడియా మేనేజ్‌మెంట్‌లో బాబు దిట్ట..

అసలు మీడియాని వాడుకోవడమనే దానికి ఆజ్యం పోసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అంతకుముందు కొంత వరకు ఉన్నా భారీ స్థాయిలో మీడియాని పోషించిన ఘనత ఆయనదే. రామోజీరావుకి కుబేరయోగం పట్టినా, ఆర్కే కోట్లకి పడగలెత్తినా అంతా చంద్రబాబు చలవే అన్నది నిర్వివాదాంశం. ఊదరగొట్టి అబద్ధాన్ని శైతం నిజం చేయగల మీడియా ధాటిని ఎదుర్కోవడానికి ఒకే ఒక్క ఆయుధముందని గుర్తించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి. తన వాయిస్‌ వినిపించుకోవడానికి తనకంటూ సొంత పత్రిక లేకపోయినా, అపోజిషన్‌కి కొమ్ము కాసే పత్రికలు చానళ్లు ఉన్నా.. 2004లో పాదయాత్ర చేసి జనం మనసు గెలుచుకుని ముఖ్యమంత్రి కుర్చీని కూడా గెలుచుకున్నారు. అంటే జనంతో మమేకమయ్యే వాడిని మీడియా శక్తి ఏమీ చెయ్యలేదని నిరూపించారు. ఏదో ఒకసారి అలా జరిగుంటుందిలే అనుకుంటే 2009 లో కూడా మళ్లీ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో అది మరోసారి రుజువయ్యింది. అయితే 2008 మార్చిలో సాక్షి పత్రిక వచ్చేసింది. అపోజిషన్‌ పార్టీని ఎదుర్కోవడానికి సొంత మీడియా ఉండాలన్న అభిప్రాయానికి వచ్చిన వైఎస్సార్‌ ఎన్నికలకి ఏడాది ముందు పత్రికను స్థాపించారు. కానీ, ఆ పత్రిక మీడియా పరంగా వైఎస్‌కు పెద్ద శక్తికాలేకపోయింది. మళ్లీ ఆయన జనంతో మమేకమయ్యే గెలిచారు.

తండ్రి బాటలోనే జగన్‌..

2019 నాటికి సొంత పత్రిక, చానల్‌ చేతుల్లో ఉన్నా అపోజిషన్‌ మీడియా ధాటిని తట్టుకోవడానికి జగన్‌ తన తండ్రిబాటనే పట్టాడు. పాదయాత్రలతో జనంతో మమేకమయ్యాడు. మండుటెండల్లో చెమట్లు కక్కే జనం మధ్య రాసుకు పూసుకుని తిరిగాడు, వాళ్ల పాకల్లో కూర్చుని వాళ్ల చేతులతో కలిపి పెట్టిన పెరుగన్నం తిన్నాడు. మీద పడి బుగ్గలు నిమిరినా ఎంగిలి అంటేలా ముద్దులు పెట్టినా చిరాకు పడలేదు. వాళ్ల కష్టాలు విన్నాడు, భరోసా ఇచ్చాడు. అంతే 2019 లో అఖండ విజయం సాధించాడు.

జనాదరణ ఉంటే మీడియా బలాదూర్‌..

వైఎస్సా, వైఎస్‌.జగన్‌ సాధించిన విజయాల ఆధారంగా.. అవతల మరఫిరంగుల్లాంటి పచ్చ ఛానల్స్‌ పేలుతున్నా, యాటం బాంబుల్లాంటి పచ్చ పత్రికలు విస్ఫోటనాలు చేస్తున్నా… వారి చుట్టూ సరౌండ్‌ అయ్యి ఉన్న ప్రజల ప్రేమ ఉక్కు కవచంలా కాపాడింది. అది జగన్‌కి అనుభవంలోకి వచ్చింది. ఇక అప్పటినుంచి దైవాన్ని, ప్రజల్ని తప్ప ఇక ఎవర్నీ నమ్మని స్థితికి వచ్చేశారు జగన్‌మోహన్‌రెడ్డి.

మీడియాను కేర్‌ చేయని సీఎం..

అపోజిషన్‌ పార్టీ తమ హయాములో సొంత మీడియా సంస్థలకు ఆర్ధిక పరిపుష్టిని ఇచ్చినట్టు ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇస్తున్నారని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ అందులో కించిత్‌ కూడా నిజం లేదు. ఏళ్ల తరబడి తన పంచన నిలబడిన మీడియాలు కదా అని ఎటువంటి ప్రత్యేకమైన వడ్డింపులూ లేవు. దానిని ఆశించినవాళ్లు తొలుత కాస్త భంగపడినా అది ఆయన తీరు అని తెలిసి స్వాగతిస్తున్నారే కానీ మొహం చాటేయట్లేదు. ఎందుకంటే జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో పూర్తిస్థాయిలో ప్రజాప్రయోజనధోరణే తప్ప మరొకటి లేదు. అయినవారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో..అనే చందాన కూడా ఏమీ జరగట్లేదు. అంతా ఒకటే అన్నట్టుంది. మీడియాని కాపాడుకోవాలి, మీడియా వాళ్లని పోషించుకోవాలి అనే ఆలోచన కంటే చేతిలో ఉన్న డబ్బుతో మరొక కొత్త సంక్షేమ పథకం పెట్టాలని ఆలోచనే ఆయనకొస్తోంది. ఒక రకంగా అది స్వాగతించదగిన పరిణామమే. మీడియాకి దొచిపెట్టకుండా ప్రజలకి పంచిపెట్టడం ఆదర్శమే. రానున్న కాలంలో ఈ విప్లవం మిగిలిన పార్టీలకు కూడా పాకితే ఫలితాలు వేరుగా ఉండొచ్చేమో.

సొంత మీడియాను కాదని సోషల్‌ మీడియాను నమ్ముకుని..

మీడియాని పెద్ద సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనపడని జగన్‌ ఒకపక్క ఐ–పాక్‌తో డీల్, మరో పక్క వైకాపా సోషల్‌ మీడియా వింగ్‌పై మాత్రం దృష్టి పెట్టారు. ప్రభుత్వ పథకాల బాకా ఊదడానికి డిజిటల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు జరిగాయి. సొంత పత్రిక, చానల్‌ ఉన్నా.. సోషల్‌ మీడియాను నమ్ముకున్నారు. అంటే సొంత మీడియాలో కన్నా.. సోషల్, డిజిటల్‌ మీడియాలోనే సమర్థులు ఉన్నారా? ఉంటే ఫలితాలెలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి.

వనరుల సద్వినియోగంలో విఫలం..

వ్యవస్థ అన్నాక కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. వ్యక్తుల మధ్యన వ్యక్తులతో పని కాబట్టి ఇగో క్లాషెస్‌ ఉంటాయి. ఎవరన్నా ఎవరి మీదైనా ఒక చిన్న అసంతృప్తినో, కంప్లైంటునో జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు మోసుకెళితే వాళ్ల ముందే సదరు వ్యక్తిని పిలిచి చివాట్లు పెట్టడం జగన్‌ తీరు. దీనివల్ల ఆయా వ్యక్తుల మధ్య వైరం పెరుగుతుంది తప్ప సంఘీభావం ఎందుకుంటుంది? ఇలా హ్యూమన్‌ రిసోర్సెస్‌ మ్యానేజ్మెంటులో జగన్‌∙విఫలమవుతున్నారన్న అభిప్రాయం ఉంది. దీనివల్ల కొత్త కంప్లైంటులేవీ జగన్‌ను చెరట్లేదు. జరుగుతున్న పొరపాట్లు జగన్‌కు తెలియడంలేదు.

Also Read: Arohi Rao-RJ Surya: కంటెస్టెంట్స్ ఆరోహి రావు-ఆర్జే సూర్య మధ్య లవ్ ఎఫైర్… నేను చూశానంటూ లీక్ చేసిన అభినయశ్రీ!

దూరమైన గెలిపించిన మీడియా

2019 ఎన్నికలకి ముందు తన గెలుపుకి సాయపడ్డారనుకున్న చాలామందికి సలహాదారులుగా నియమించారు జగన్‌. కానీ ఇందాక చెప్పుకున్నట్టు ఏ జీతమూ ఆశించకుండా 2019 ఎన్నికల సమయంలో పోరాడిన అనామక సోషల్‌ మీడియా సేన చాలామందున్నారు. వారిలో కొందరు తమపేర్లతో సహా వైకాపాలోని ఉన్నతశ్రేణులకి తెలుసు. వాళ్లు అపోజిషన్‌ పెట్టిన కేసుల్లో ఇరుక్కుంటే ఒక్కళ్లు సంఘీభావం తెలుపలేదు. దీంతో ప్రస్తుతం వారు జగన్‌కు దూరమయ్యారు. సొంత మీడియాలో పనిచేసిన వారు కూడా అపోజిషన్‌ మీడియాలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సోషల్‌ మీడియా కూడా దూరమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. వరాలివ్వని దేవుడికి, కనీసం చూపు కూడా సారించని దేవుడికి ఎందుకు మొక్కుతారు? ఏ వరమూ ఇవ్వకపోయినా పర్వాలేదు…నీకు కొమ్ముకాయడానికే మేము పుట్టాము అనే వాళ్లు ఎంతమందుంటారు? చూడాలి!

ఇదే ధోరణిలో కొనసాగుతూ ‘ప్రజలు–దైవం‘ అనే కాన్సెప్టుతో మాత్రమే 2024 ఎన్నికల్లో ముందుకెళితే జగన్‌మోహన్‌రెడ్డికి మళ్లీ మునుపటి విజయం వస్తుందా అనేది చూడాలి. ఫలితమేదైనా ఆయన స్వానుభవమే ఆ తర్వాత ఆయనకి మార్గనిర్దేశం చెయ్యాలి. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు మరి!

Also Read: Kerala Auto Driver: ఆ ఆటో డ్రైవర్ కు రూ.25 కోట్లు వచ్చాయి.. ఎలానో తెలిస్తే షాక్ అవుతారు !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular