Pawan Kalyan- Jagan: జనసేన యువశక్తి అధికార పార్టీని కలవరపెడుతున్నట్టుంది. మిగతా పార్టీల్లా జన సమీకరణ చేయకున్నా లక్షలాది మంది యువత తరలిరావడంతో జగన్ సర్కారు తక్షణ ఉపశమన చర్యలకు దిగుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ ఏలుబడిలో ఉత్తరాంధ్ర దగాకు గురైందని యువత ఆగ్రహంగా ఉన్నారు. యువశక్తి వేదికపై ఇదే అంశాలపై ఎక్కువమంది యువ ప్రతినిధులు మాట్లాడారు. మూడు రాజధానుల పేరిట ఉత్తరాంధ్రను సమిధగా మార్చారని.. రాజధాని కాకుండా అభివృద్ధి చేసి చూపించాలని యువత డిమాండ్ చేశారు. అయితే యువత పొలి కేకలు జగన్ సర్కారుకు తాకినట్టున్నాయి. అందుకే ఆఘమేఘాల మీద ఉత్తరాంధ్రపై కీలక నిర్ణయం దిశగా జగన్ అడుగులేస్తున్నారు విశాఖ వేదికగా జీ20 సన్నాహాక సదస్సు, అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ మీట్ జరగనున్నాయి. అవి పూర్తయ్యాక విశాఖ నుంచి పాలన సాగించేందుకు జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకు సంబంధించి రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టులో ఉంది. ఈ నెలాఖరుకు దీనిపై తీర్పు వెలువడే అవకాశముంది. మూడు రాజధానులకు మద్దతుగానే తీర్పు వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తీర్పు ఎలా వచ్చినా.. ముఖ్యమంత్రి పాలనను ఎక్కడ నుంచైనా సాగించే వెసులబాటు ఉండడంతో ముందుగా సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుచేయాలన్న తలంపులో జగన్ ఉన్నారు. ఉగాది నాటి నుంచి విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్నట్టు సమాచారం. తాజాగా విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ సదస్సుల నిర్వహణపై జగన్ సమీక్షించారు. అధికారులకు కొన్నిరకాల ఆదేశాలిచ్చారు. సలహాలు, సూచనలు అందించారు. విశాఖ నుంచి పాలనపై స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ మంత్రుల నుంచి దిగువస్థాయి నాయకుల వరకూ విశాఖ రాజధాని తధ్యమన్న ప్రకటనలు ఈ అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి.
శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. అప్పట్లోగా సుప్రిం కోర్టు నుంచి తీర్పు వచ్చే అవకాశముంది. అందుకే మార్చి నెలాఖరు నుంచి విశాఖ నుంచి పాలనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందుగా సీఎం క్యాంప్ ఆఫీసు ను ప్రారంభించి అక్కడ నుంచే రివ్యూలు మొదలుపెట్టనున్నారు. మంత్రివర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. అటు మంత్రులు సైతం క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే మాత్రం వచ్చే విద్యాసంవత్సరం నుంచి సచివాలయాన్ని కూడా విశాఖలో కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మంత్రులు కూడా ఇదే మాటను చెప్పుకొస్తున్నారు.

విశాఖ నుంచి పాలన మొదలుపెట్టి తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపాలని జగన్ భావిస్తున్నారు. తమ ప్రాంతానికి రాజధాని వస్తుందన్న సంతోషంలో ఉత్తరాంధ్ర ప్రజలు లేరు. అది అధికార పార్టీకి కలవరపరుస్తోంది. అటు సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలు వద్దంటున్నా సాహసోపేత నిర్ణయం తీసుకున్నా ఉత్తరాంధ్ర ప్రజలు తమను నమ్మకపోవడం ఏమిటని జగన్ తెగ బాధపడుతున్నారట.పైగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపడం ఏమిటని లోలోపల రగిలిపోతున్నారుట. యువశక్తి రూపంలో పవన్ కోట్టిన దెబ్బకు చిర్రెత్తుకొచ్చి ఇప్పుడు ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది.