Pawan Kalyan CM: రణస్థలం యువశక్తి సభ ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. మరెన్నో ప్రశ్నలకు పురుడు పోసింది. జనసేనాని తన మనోగతాన్ని ఆవిష్కరించారు. రాజకీయ ప్రయాణం పై స్పష్టతనిచ్చారు. కానీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనాని వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఏపీ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేశాయి.

“పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అని మీరు చెప్పాలి. నేను కోరుకుంటే జరగదు. మీరు అధికారం ఇస్తే సేవకుడిలా పనిచేస్తా..’’ అంటూ రణస్థలం వేదికగా పవన్ తన మనోగతం చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ, జనసేన నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తాను కీలక పాత్రపోషిస్తానని పవన్ చెప్పకనే చెప్పారు. జనసేన అధికారం కోసం జనసైనికులు అహర్నిశలు శ్రమించాల్సిన అవసరాన్ని గుర్తి చేశారు. సీట్ల పంపకంలో తమ న్యాయమైన వాటా ఉండాలంటూ పరోక్షంగా టీడీపీకి సూచన చేశారు.
పవన్ వ్యాఖ్యలు టీడీపీలో ఒకింత కలవరానికి కారణమయ్యాయి. పవన్ ను సీఎంను చేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధపడతాయా?. చంద్రబాబు ఒప్పుకుంటాడా ? అన్న చర్చ మొదలైంది. పవన్ సీఎం కావాలంటే సీట్ల పంపకం నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తారన్న అంశం కూడ కీలకం కానుంది. పోటీ చేసే సీట్లలో మెజార్టీ సీట్లు గెలవగలిగితే పవన్ డిమాండ్లకు టీడీపీ తలొగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. లేనిపక్షంలో టీడీపీతో అధికారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.

పవన్ సీఎం కావాంటే కింగ్ మేకర్ కావాల్సిన అవసరం ఉంది. కనీసం 40 సీట్లు గెలిస్తే పవన్ ఈజీగా ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబుకు కూడ తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే సీట్ల పంపకం పై కూడ జనసేనాని టీడీపీకి హింట్ ఇచ్చారు. గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలనే డిమాండ్ పరోక్షంగా టీడీపీ ముందు ఉంచారు. జనసేన డిమాండ్ మేరకు టీడీపీ సీట్లు ఇచ్చి.. జనసేన మెజార్టీ స్థానాల్లో గెలవగలిగితే సీఎం కావడం సులువు అవుతుంది. లేదంటే టీడీపీ సీఎం పదవి వదులుకోవడానికి అంత ఈజీగా ఒప్పకోదు. 2024 ఎన్నికల్లో జనసేన గెలిచే స్థానాలే పవన్ భవితవ్యాన్ని తేల్చనున్నాయి.