
రాజకీయ రంగంలోనైనా, సినిమా రంగంలోనైనా ప్రతి ఒక్కరికీ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిలో కొన్ని పాజిటివ్ సెంటిమెంట్లు కాగా మరికొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు ఉంటాయి. అయితే కొన్నిసార్లు సెంటిమెంట్లను బ్రేక్ చేస్తే అనుకున్న ఫలితాలు దక్కవని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే సీఎం జగన్ మాత్రం సెంటిమెంట్ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ధైర్యానికి , మొండితనానికి ఐకాన్ గా నిలిచే జగన్ తాజాగా ఒక సెంటిమెంట్ కు ఫుల్ స్టాప్ పెట్టారు.
సాధారణంగా ఏపీకి సీఎంగా ఉండేవాళ్లు తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో గరుడసేవ రోజున పట్టువస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంటుంది. అయితే 17 సంవత్సరాల క్రితం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గరుడసేవ రోజున పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లారు. అయితే ఊహించని విధంగా ఆ సమయంలో నక్సలైట్లు చంద్రబాబుపై దాడి చేశారు.
గరుడ సేవ రోజున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో చంద్రబాబు గరుడసేవ రోజుకు బదులుగా ధ్వజారోహణం రోజున పట్టువస్త్రాలు సమర్పించడానికి మొగ్గు చూపారు. ఉమ్మడి ఏపీలో ఈ ఘటన సంచలనం సృష్టించడంతో ఈ ఘటన తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ధ్వజారోహణం రోజునే పట్టు వస్త్రాలు సమర్పించారు.
చంద్రబాబు మొదలుపెట్టిన ఆ ఆనవాయితీ నేటికీ కొనసాగుతూ ఉంది. గరుడసేవ రోజున ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం వల్ల ఈ సెంటిమెంట్ నేటికీ కొనసాగుతూ వస్తోంది. అయితే తిరుమల పూజారులు గతంలో ఉన్న ఆనవాయితీని గుర్తు చేసి జగన్ ను గరుడసేవ రోజున పట్టువస్త్రాలు సమర్పించాలని కోరడంతో తాను నెగిటివ్ సెంటిమెంట్లను పట్టించుకోనని… గరుడసేవ రోజునే పట్టు వస్త్రాలను సమర్పిస్తానని పూజారులకు చెప్పడం గమనార్హం. హిందూ దేవాలయాల విషయంలో విమర్శలు చేసేవాళ్లకు జగన్ తన నిర్ణయంతో షాక్ ఇచ్చాడనే చెప్పాలి.