YS Jagan: గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయానికి అనేక కారణాలున్నాయి. నవరత్నాలు వర్కవుట్ అయ్యాయి. చాలా రకాల హామీలు పనిచేశాయి. ప్రధానంగా 4 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నిరుద్యోగ యువతలోకి చొచ్చుకెళ్లింది. ప్రత్యేక హోదాతో పాటు పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంతా నమ్మారు. కానీ ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఉద్యోగాల భర్తీ లేదు. ప్రత్యేక హోదా రాలేదు. పరిశ్రమల జాడలేదు. జగన్ చేసినదల్లా వలంటీరు, సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం. అందులో వలంటీరు వ్యవస్థ వైసీపీ సైన్యంగా పనిచేస్తోంది. సచివాలయ వ్యవస్థ మాత్రం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తోంది.
అయితే ఇప్పుడు వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో దెబ్బ తప్పదన్న వార్తలు వస్తున్నాయి. అయితే వలంటరీ, సచివాలయ వ్యవస్థతో గట్టెక్కుతానని జగన్ చెబుతున్నారు. కానీ అది సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు సాధించారు.. కనుక సచివాలయ ఉద్యోగులు సానుకూల దృక్పథంతో పనిచేస్తారని వైసీపీ ఆశీస్తోంది. మరో ప్రభుత్వం వస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఉంటున్న దృష్ట్యా వారు కచ్చితంగా తమ వైపే మొగ్గుచూపుతారని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందని.. గెలుపు కష్టమేనని టీడీపీ భావిస్తోంది. అందుకే మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్దపీట వేసింది. వైసీపీ ఓటర్లను తమ వైపు తిప్పకునే ఎత్తుగడ వేసింది. అయితే ఎంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నప్పటికి వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయంలో వైఎస్ జగన్ కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు అండగా ఉంటారని కొండంత నమ్మకంతో ఉన్నారు. అందుకే టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
జగన్ ధీమాపై టీడీపీ ఫోకస్ పెట్టింది. జగన్ కు అండగా నిలిచే వర్గాలను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. మహిళలను టార్గెట్ చేసుకొని మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. దసరాకు పూర్తిస్థాయి జనాకర్షక మేనిఫెస్టో ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అటు సచివాలయ వ్యవస్థపై నమ్మకం ఉంచేలా కొన్నిరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన సచివాలయ వ్యవస్థ జోలికి పోమని.. వారితో పని చేయించుకుంటామని అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు చెబుతున్నారు. అంటే సచివాలయ వ్యవస్థను అడ్డంపెట్టుకొని ఏపీ రాజకీయం కొనసాగుతోందన్న మాట.