Homeఆంధ్రప్రదేశ్‌Jagan Vs Chandrababu: నాడు జగన్.. నేడు చంద్రబాబు.. ఇద్దరిదీ అదే పోలిక

Jagan Vs Chandrababu: నాడు జగన్.. నేడు చంద్రబాబు.. ఇద్దరిదీ అదే పోలిక

Jagan Vs Chandrababu: అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. మద్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. సుమారు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ర్యాలీగా ఆయన ఇంటికి తీసుకువెళ్లాయి. ఈ నేపథ్యంలోనే జగన్ చర్చకు రావడం ప్రారంభించారు. ఆయన అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. అప్పట్లో ఆయనకు చాలా రోజుల తర్వాత బెయిల్ లభించింది. ఆ సందర్భంలో సైతం వైసీపీ శ్రేణులు సాదరంగా స్వాగతం పలికాయి. అయితే అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబులో ఎవరికి ఎక్కువగా స్వాగతం లభించింది అన్న విషయంలో వేరువేరు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

2012లో అవినీతి కేసుల్లో జగన్ ను సీబీఐ అరెస్టు చేసింది. దాదాపు 16 నెలల అనంతరం 2013 సెప్టెంబర్ 23న ఆయనకు బెయిల్ లభించింది. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్ర విభజన ఉద్యమం భారీ స్థాయిలో ఉంది. సరిగ్గా అదే సమయంలో జగన్ విడుదల కావడంతో చంచల్ గూడా జైలు నుంచి హైదరాబాదులోని లోటస్ ఫండ్ వరకు సీఎం జగన్ కాన్వాయ్ సాగింది. అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో ఆ కొద్ది దూరం ప్రయాణం నాలుగు గంటల పాటు సాగడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. ఆ ఆ పార్టీయే జగన్ పై కేసుల నమోదు చేసిన నేపథ్యం.. అయినా సరే భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్కు ఆహ్వానం పలికేందుకు రావడం విశేషం. ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి ఏపీలో ఆ ఘటన ఒక సంచలనం రేకెత్తించింది. జగన్ పై కేసులు సానుభూతిని తెచ్చిపెట్టాయి.

ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే రకమైన సానుభూతి వ్యక్తం అయ్యింది. అసలు ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అరెస్టు చేశారని టిడిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పక్కా ఆధారాలు ఉన్నాయని వైసీపీ చెబుతోంది. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమైన అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. పైగా ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. చంద్రబాబు ఆరోగ్యంతో పాటు భద్రతపై రకరకాల కథనాలు వచ్చాయి. ఇవన్నీ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబును జైల్లో పెట్టారని తటస్థులు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే చంద్రబాబు బెయిల్ వేళ ప్రజల నుంచి ఒక రకమైన సానుభూతి వచ్చింది. టిడిపి శ్రేణులే కాకుండా తటస్తులు సైతం చంద్రబాబుకు బెయిల్ దక్కడాన్ని ఆహ్వానించారు.

అసలు హైకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కుతుందని ఎవరూ భావించలేదు. కానీ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కోర్టు స్పందించింది. బెయిల్ మంజూరు చేసింది. నిన్న మధ్యాహ్నం తీర్పు వెల్లడించింది. బెయిల్ ప్రక్రియ పూర్తయ్యాక సాయంత్రం 4:40 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు అడుగుపెట్టారు. అది మొదలు టిడిపి శ్రేణులు, అభిమానులు ఆయనను ముంచెత్తారు. భారీ కాన్వాయ్ తో రోడ్డు మార్గంలో ప్రారంభమైన ర్యాలీ.. ఉండవెల్లి నివాసం చేరుకునేసరికి తెల్లవారుజాము 5 గంటలు అయ్యింది. అప్పుడు జగన్ విషయంలో అలా.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఇలా అన్న పోలిక ప్రారంభమైంది. అప్పుడు సానుభూతి వర్కౌట్ అయినట్టే.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular