CM Jagan Targets: ఏపీలో సీఎం జగన్ బాధితులు చాలా మంది ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నారు. చివరకు సొంత పార్టీలో సైతం దెబ్బతిన్న వారూ ఉన్నారు. అందులో ప్రధానంగా కాపు సామాజికవర్గం నేతలే ఉండడం విశేషం. వారికి తెలియకుండానే… వారి రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టి ప్రత్యర్థులపై పైచేయి సాధించే పనిలో జగన్ ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటివరకూ సక్సెస్ అవుతూ వచ్చారు. మరీ ముఖ్యంగా పవన్ విషయంలో కాపు నేతలను చాలా చక్కగా వినియోగించుకున్నారు. పవన్ అయినా, చంద్రబాబు అయినా.. మరే ఇతర నేతలైనా ప్రభుత్వానికి విమర్శించినా, జగన్ పై మాట్లాడినా ముందుగా తెరపైకి వచ్చేది వైసీపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలే. విచిత్రమేమిటంటే ప్రభుత్వ పాలసీలు, పార్టీ విధానాలపై మాట్లాడేది రెడ్డి సామాజికవర్గం వారైతే… ఇతర కులాల నాయకులపై తిట్ల దండకానికి మాత్రం కాపు నేతలే జగన్ కు కనిపిస్తున్నారు.

అయితే కాపులు, కాపు నాయకుల విషయంలో జగన్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో అధికారంలో వచ్చిన తొలిరోజుల్లోనే కళ్లు తేలేశారు. రిజర్వేషన్లు తన పరిధిలో లేవని తేల్చేశారు. అటు రాజ్యాధికారం తన వద్ద పెట్టుకొని మంత్రులుగా కొంతమంది నోరున్న కాపు నాయకులను నియమించుకున్నారు. వారితోనే తన రాజకీయాలను నెరుపుతున్నారు. తన నాయకత్వాన్ని అడిక్ట్ చేసేశారు. ఎంతలా అంటే పేర్ని నాని వంటి వారు సొంత సామాజికవర్గాన్నితిట్టించేటంతగా.. చివరకు తాను సీఎం జగన్ కుటుంబానికి పెద్ద పాలేరు అని కూడా చెప్పించారు. వివాదాస్పద ఏ నిర్ణయం అయినా కాపు మంత్రులతోనే చెప్పిస్తున్నారు.
తమ భుజంపై తుపాకీ పెట్టి జగన్ ప్రత్యర్థులను కాల్చుతున్న వైఖరి కొందరు కాపు పెద్దలకు తెలుసు. కానీ తాత్కాలికంగా అధికారానికి వారంతా దాసోహమవుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ విమర్శించిన ప్రతిసారి కాపు మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వంటి మంత్రుల బృందం రంగంలోకి దిగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలను అమలుచేస్తుంది. అది మంచైనా, చెడైనా ఆలోచించకుండా నోటికి ఎంతపడితే అంత వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ జగన్ సామాజికవర్గానికి చెందిన వారు.. ఆయన ఆత్మీయ బంధువులు ఎవరూ రంగంలోకి దిగకపోవడాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. జగన్ రాజకీయ తంత్రాన్ని గుర్తించలేకపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్ ను పణంగా పెడుతున్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మొన్న విశాఖ ఎపిసోడ్ ను కూడా జగన్ కాపు మంత్రులతో రక్తికట్టించాలని చూశారు. అందుకే దానికి పవన్ కూడా దీటైన కౌంటర్ ఇచ్చారు.
